- రాష్ట్రంలో యువతకు ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ
- 10 లక్షల మందిని తీర్చిదిద్దాలి
- ఐబీఎం చైర్మన్, సీఈవోను కోరిన సీఎం చంద్రబాబు
- దావోస్‌లో దిగ్గజ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు భేటీ
దావోస్ (చైతన్యరథం): రాష్ట్రంలో యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం, సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా తీర్చిదిద్దాలని ఐబీఎం చైర్మన్, సీఈవోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్ పర్యటన రెండోరోజు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఐబీఎం చైర్మన్ అర్వింద్ కృష్ణతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో రాష్ట్ర యువతకు శిక్షణ ఇవ్వడంపై చర్చించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 10 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అమరావతిలో ఐబీఎం భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ పైనా ఈ సమావేశంలో చర్చించారు. క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల పై సానుకూలంగా స్పందించిన ఐబీఎం సీఈవో వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
వేగంగా విశాఖ గూగుల్ డేటా సెంటర్
అనంతరం గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. విశాఖలో ‘గూగుల్ ఏఐ డేటా సెంటర’ నిర్మాణంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎలాంటి జాప్యం లేకుండా డేటా సెంటర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. డేటా సెంటర్ నిర్మాణం లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రోపర్టీ ఆర్గనైజేషన్(WIPO) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, డైరెక్టర్ అనిల్ మూర్తితోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మేధోసంపత్తి హక్కుల రక్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, పరిశోధన–అభివృద్ధి, పేటెంట్ వ్యవస్థ బలోపేతం చేయడం లాంటి అంశాలపై చర్చించారు. ఆర్థిక వృద్ధికి ఆవిష్కరణలు కీలకమని.. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు డబ్లుఐపీఓ సహకారం అందించాలని సీఎం ప్రతిపాదించారు.













