దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): బ్రూక్ ఫీల్డ్ ఎసెట్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ కానర్ టెస్కీతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఇటీవల విశాఖ సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు గిగా వాట్ స్కేల్ క్లీన్ ఎనర్జీ పవర్డ్ డేటా సెంటర్ ప్లాట్‌ఫాం పనులను వేగవంతం చేయాలని కోరారు. గ్రిడ్ స్కేల్ స్టోరేజీ అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ స్టోరేజి, సోలార్ సెల్, మాడ్యుల్ తయారీ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయండి. కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో పారిశ్రామిక క్లస్టర్ల సమీపాన గ్రీన్ మాలిక్యూల్/హైడ్రోజన్ లింక్డ్ పైలట్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించండి. ఏపీ ఐటి కారిడార్ లో మిశ్రమ వినియోగానికి లార్జ్ స్కేల్ కమర్షియల్ ఐటీ ఆఫీస్ స్పేస్‌ను అభివృద్ధి చేయండి. బ్రూక్ ఫీల్డ్ – ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు సహకరించేందుకు నిర్మాణాత్మక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
బ్రూక్ ఫీల్డ్ ఎసెట్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ కానర్ టెస్కీ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు బ్రూక్ ఫీల్డ్ ఇప్పటికే ఒప్పందం చేసుకుందన్నారు. ఎనర్జీ, డిజిటల్ ఇన్ ఫ్రా, రియల్ ఎస్సెట్స్ రంగాలు భారత్‌లో దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్ గా మేం గుర్తించాం. క్లీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్, క్లీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లు, ఇండస్ట్రియల్ స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు మా ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని టెస్కీ పేర్కొన్నారు.













