- 2029 నాటికి సాధించటమే లక్ష్యం
- ఏపీకి ఇప్పటికే రూ.5.22 లక్షల కోట్ల మేర క్లీన్ ఎనర్జీ పెట్టుబడులు
- తద్వారా పునరుత్పాదక శక్తి, అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాల కల్పన
- సస్టెయినబులిటీపై సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): గ్రీన్ ఎనర్జీ రంగంలో 2029 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం.. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ ఇప్పటికే రూ.5.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.. తద్వారా పునరుత్పాదక శక్తి, అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలు రానున్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సుస్థిరతను విస్తృతస్థాయిలో అమలుచేయడం: ప్రపంచ పరివర్తనకు మార్గాలు (Sustainability at Scale: Pathways for Global
Transformation) ఆధ్వర్యంలో దావోస్‌లో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఐఐ నిర్వహించిన ఈ సమయోచిత చర్చలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సస్టెయినబులిటీ ఇప్పుడు ఉద్దేశాల దశను దాటి అమలు దశలోకి ప్రవేశించింది. ఇది కార్యాచరణకు అంకితమైన దశాబ్దం. సస్టెయినబులిటీని మూడు విధాలుగా చూస్తున్నాం. మొదటిది ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా మేం 6 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతున్నాం. ఇందుకు అవసరమైన విద్యుత్ ను కాలుష్యరహితంగా అందించడానికి ప్రభుత్వం 24 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్‌ను ఇప్పటికే ప్రారంభించాం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఇది డిజిటల్ గ్రోత్, క్లీన్ ఎనర్జీ ఒకేసారి ముందుకు సాగాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు.
ఫలితాలపైనే దష్టి
రెండోది ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఛైర్మన్‌గా నేను అవుట్‌కమ్స్ పైనే దృష్టి పెడతాను. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక శక్తి, అనుబంధ రంగాల్లో అమలులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 2.7 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. మూడోది ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ఆమోదించాం. తద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో 2029 నాటికి 125 బిలియన్ డాలర్ల (రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవి సౌర, పవన, నిల్వ (స్టోరేజ్), గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రానున్నాయి. మేం కేవలం కెపాసిటీ మాత్రమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్, స్కిల్స్, సప్లయి చైన్స్ సహా పూర్తి ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలో గత 18 నెలల కాలం ఇందుకు బలమైన నిదర్శనమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
జర్మనీకి గ్రీన్ అమ్మోనియా ఎగుమతి
గతేడాది, సీఐఐ వేదికలపై కుదిరిన ఎంవోయూల ద్వారా ఆంధ్రప్రదేశ్ 65 బిలియన్ డాలర్ల (రూ.5.22 లక్షల కోట్లు) విలువైన క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆయా పెట్టుబడులు పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాయి. భారతదేశ సౌర రంగం ఇప్పుడు మాడ్యూళ్ల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. తదుపరి దశ సెల్స్, ఇంగాట్స్, వాఫర్లలో ఉంది. ఇందులో భారతదేశ టాప్ 10 సౌర పరికర తయారీదారుల్లో 5 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక ప్రాజెక్ట్ భారత్ నుంచి జర్మనీకి ప్రపంచంలోనే తొలి దీర్ఘకాలిక గ్రీన్ అమ్మోనియా ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, మొత్తం భారతదేశానికి కీలక మలుపు. ఎనర్జీ దిగుమతిదారుడి నుంచి ఎనర్జీ ఎగుమతిదారుడిగా మారుతున్న దిశలో ఒక చారిత్రక అడుగుగా మంత్రి లోకేస్ పేర్కొన్నారు.
మా విధానాలపై నమ్మకం
కేవలం ఏడు నెలల్లోనే 600 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇప్పటికే తదుపరి 550 మెగావాట్ల ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. రెన్యూ(ReNew) సంస్థ 2.5 గిగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టుతో మొదలుపెట్టి, ఇప్పుడు విశాఖపట్నం సమీపంలో 6 గిగావాట్ల వాఫర్, ఇంగాట్ తయారీ యూనిట్‌లో పెట్టుబడి పెడుతోంది. టాటా పవర్ 7 గిగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రారంభించి, ఇప్పుడు 10 గిగావాట్ల తయారీ సదుపాయం ఏర్పాటు చేయడానికి తిరిగి వస్తోంది. ఈ పెట్టుబడులే మా విధానాలపై ఉన్న నమ్మకానికి అతిపెద్ద సాక్ష్యం. మా లక్ష్యం 2.7 లక్షల గ్రీన్ ఎనర్జీ ఉద్యోగాలు. దీనికి విస్తృత స్థాయిలో నైపుణ్యాభివృద్ధి మద్దతుగా ఉంది. ఎనర్జీ ట్రాన్‌సిషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఐఐటీ తిరుపతితో ఒప్పందం కుదుర్చుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు.
నాలుగు అంశాలు కీలకం
భవిష్యత్ లక్ష్యాలను నాలుగు అంశాలు దిశానిర్దేశం చేస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థకు ప్రాధాన్యత – విద్యుత్ ఉత్పత్తి నుంచి గ్రీన్ ఫ్యూయెల్స్ తయారీ వరకు సమగ్ర దృష్టి. జాతీయ పీఎలఐ మద్దతు పొందిన పది కంపెనీల్లో ఐదు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. రియల్-టైమ్ గవర్నెన్స్ – అమలు, పారదర్శకత, బాధ్యతను మెరుగుపరచడానికి డేటా ఆధారిత పర్యవేక్షణ. గ్రీన్ జాబ్స్, స్కిల్స్ – ఐదేళ్లలో 3 లక్షల క్లీన్ ఎనర్జీ ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాల విస్తృత లక్ష్యానికి తోడ్పాటు. విధాన స్థిరత్వం, సామర్థ్యం – 2030-31 నాటికి రూ.8వేల కోట్ల శక్తి సామర్థ్య పెట్టుబడులు. ఎందుకంటే కేవలం సామర్థ్య పెంపే ఉద్గారాల తగ్గింపులో దాదాపు 40% సామర్థ్యాన్ని అందించగలదు. సమగ్ర పాలన ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయనేందుకు ఏపీ నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం ఆశయాలు, లక్ష్యాల గురించి మాట్లాడకుండా, వాటిని అమలు చేయడంపై ప్రభుత్వాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులను ఏకం చేయడానికి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా అవసరం. విస్తృత స్థాయి, ఆవిష్కరణ, ప్రజాస్వామ్య న్యాయబద్ధత, బలమైన అమలు సామర్థ్యంతో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రపంచ భాగస్వామ్యాలకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐఐ ఇండియా సస్టెయినబులిటీ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ జయంత్ సిన్హా , తదితరులు పాల్గొన్నారు.













