అమరావతి (చైతన్య రథం): శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనను కలచివేసిందన్నారు. భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను సీఎం కోరారు. ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తడంతో కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.











