- 40 శాతం పాఠశాలలు 2స్టార్ కంటే తక్కువగా ఉన్నాయి
- నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదు
- ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం
- శాసనమండలిలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2020 నుంచి 2026 వరకు ఆర్థిక సంవత్సరాల వారీగా మనబడి నాడు-నేడు, మన బడి-మన భవిష్యత్ పథకాల కింద ఖర్చు చేసిన నిధుల వివరాలు, ఆయా పథకాల కింద పూర్తిగా అభివృద్ధి చేసిన, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పాఠశాలల వివరాలపై సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ… కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.7,500 కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. ‘ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నేను చెప్పాను. 18 అంశాలపై స్టార్ రేటింగ్ ఇచ్చాం. స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాత మేం గమనించింది.. సుమారు 40శాతం పాఠశాలలు 2స్టార్ కంటే తక్కువగా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం.
నేను చిత్తూరు పర్యటకు వెళ్లినప్పుడు కొన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, పెయింటింగ్, బేసిక్ బెంచెస్, ఫర్నిచర్స్ లేవు. ముందు లీక్ ప్రూవ్ బిల్డింగ్స్, బెంచ్‌లు, పెయింటింగ్, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలనేది మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాలల్లో పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం సమీక్ష చేస్తున్నాం. జీవో నెం.117కు ప్రత్యామ్నాయంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తరగతికో ఉపాధ్యాయుడు విధానాన్ని తీసుకువచ్చాం. గతంలో కేవలం 3శాతం పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడు ఉంటే.. ఇప్పుడు 33శాతానికి తీసుకువచ్చాం. దీనివల్ల కొన్ని పాఠశాలల్లో ఎక్కువ తరగతి గదుల అవసరం ఉంది. వీటన్నింటినీ పరిశీలించి మేం ముందుకు వెళ్తాం. గతంలో నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన 233 పాఠశాలలు మూసివేశారు. నిధులు అనవసరంగా వృధా చేయకూడదు. ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. గ్యారంటీడ్ ఎఫఎలఎన్ పైనా దృష్టి సారించాం. 2019 నంచి 2024 వరకు లెర్నింగ్ అవుట్ కమ్స్‌లో వెనుకబడ్డాం.
కూటమి ప్రభుత్వంలో నాడు-నేడు కింద రూ.500 కోట్లు బకాయిలు చెల్లించాం
వైసీపీ హయాంలో నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదు? బిల్లులు చెల్లించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కూటమి ప్రభుత్వంలో రూ.500 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాము. ఈ వివరాలన్నీ గత అసెంబ్లీ సెషన్స్‌లో విద్యా రంగంపై లఘు చర్చలో వెల్లడించాం. వైసీపీ వాకౌట్ చేయకుండా హౌస్‌లో ఉంటే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పేవాడిని. వాకౌట్ చేశారు కాబట్టి మీకు సబ్జెక్ట్ తెలియట్లేదు. వైసీపీ హయాంలో అద్భుతంగా పనిచేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఎందుకు పడిపోయాయి? ఎఫఎలఎన్ చూస్తే.. 84.3 శాతం మూడో తరగతి, 62.5 శాతం ఐదో తరగతి, 47 శాతం 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. అందుకే ఏఐ టూల్ ద్వారా గ్యారంటీడ్ ఎఫఎలఎన్ చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీపడే విధంగా తీర్చిదిద్దుతాం’ అని చెప్పారు.












