పాలకొల్లు (చైతన్య రథం): పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధిలో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మేమే ముందుంటామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలోని యలమంచిలి మండలం కంచుస్థంభం పాలెంనుంచి బాడవ వరకు 16.72 కోట్లతో నిర్మిస్తున్న గోదావరి ఏటిగట్టు పటిష్ట పనులను పరిశీలించారు. 1986 గోదావరి వరదలలో అత్యధికంగా 36 లక్షల క్యూసెక్కులు వరద నీరు వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వరదలు వచ్చిన ప్రతిసారి గోదావరి తీర గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం కావాలన్న ఉద్దేశంతోనే ఏటిగట్ల పటిష్టతకు 18 కోట్లు, దానిపై గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి నాలుగు కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టామన్నారు. 2019 -24 వైకాపా హయాంలో ఒక్క పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రంలో నిధుల సమస్య ఉన్నా తాను కష్టపడి మంజూరు చేయించిన నిధులు ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి అన్నారు. ఈరోజు 4.5 కోట్ల రూపాయల విలువైన 23 పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన ఏటిగట్టు పనులకు సంబంధించిన నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పర్యవేక్షణ అధికారులను, కాంట్రాక్టర్‌ను పిలిచి మాట్లాడారు. టెండర్ నిబంధనల ప్రకారం ఏం చేయాలి? మీరు ఏం చేస్తున్నారంటూ ఆరా తీశారు. బయటనుంచి మట్టి తెచ్చుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. మట్టిలో వేర్లు, ఆకులు ఉండకూడదు. మీరు ఏతప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి.. తప్పిదానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. స్థానికులతో మాట్లాడుతూ ఏటిగట్టు తొలిదశగా మట్టి రోడ్డు, తర్వాత గ్రావెల్ రోడ్డు, తర్వాత బ్లాక్ టాప్ వేస్తామని వివరించారు. అలాగే స్థలంలేని వాళ్ళకి స్థలాలు, స్థలాలున్న వాళ్ళకి ఇళ్ళు యుద్ధ ప్రాతిపదికన కట్టించే ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన వారెవరు కూడా బాధపడుతూ కాకుండా ఆనందంగా వెళ్లాలని, ఆ రకంగా ఇళ్ల నిర్మాణం జరగాలని ఆయన సూచించారు.














