- కన్హా శాంతివనం సందర్శనలో సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ శివారులోని శాంతివనంలో ముఖ్యమంత్రి పర్యటన
- దేశంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం, వెల్‌నెస్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, హార్ట్‌ఫుల్ ఇంటర్నెషనల్ స్కూల్ సందర్శించిన సీఎం
హైదరాబాద్ (చైతన్యరథం): ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివన ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. కన్హా శాంతివనం నిర్వాహకులు, శ్రీరామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో సమావేశమయ్యారు. శాంతివనంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం, వెల్‌నెస్ సెంటర్, యోగా కేంద్రం, హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ స్టేడియంను దాజీతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. అలాగే శాంతివనంలో జరుగుతోన్న శాస్త్రీయ, వృక్షశాస్త్ర పరిశోధనల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. శాంతి వనంలో చేపడుతున్న జీవ వైవిధ్యం, పర్యావరణ కార్యక్రమాలను వీక్షిస్తూ సీఎం చంద్రబాబు రెయిన్‌ఫారెస్ట్‌ను సందర్శించారు. రెయిన్ ఫారెస్ట్ రూపకల్పన, దానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సీఎంకు దాజీ వివరించారు.
అలాగే ధ్యాన మందిరం వెలుపల ఉన్న వర్షపు నీటి సంరక్షణ ప్రాంతమైన బాబూజీ వనాన్ని సీఎం సందర్శించారు. హార్ట్‌ఫుల్‌నెస్ స్కూల్‌ను, గోపీచంద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అకాడమీని, ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…కన్హా శాంతివనంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే వాతావరణం ఉందన్నారు. విద్యా రంగంలో కొత్త ప్రమాణాలు పాటిస్తూ… హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయన్నారు. కన్హా శాంతివనం స్వర్గాన్ని తలపించేలా ఉందని, పర్యావరణాన్ని కాపాడుతూ శాంతివనాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతమని వ్యాఖ్యానించారు. రేపటి తరం నాయకులను తీర్చిదిద్దేలా హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నెషనల్ స్కూల్ నడుపుతున్నారని సీఎం ప్రశంసించారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి శాంతివనాన్ని సందర్శించడం సంతోషాన్నిస్తోందని శ్రీరామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీ అన్నారు. అలాగే విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో సేవలను అందిస్తున్నామని దాజీ తెలిపారు.
కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ నగర శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కన్హా ధ్యానమందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. కన్హాశాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాలను గురించి సీఎంకు దాజీ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీని ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. అదే విధంగా చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను కూడా సీఎం చంద్రబాబు సందర్శించారు. ధ్యాన మందిరం సందర్శన అనంతరం దాని రూపకల్పన, సామర్థ్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాజీ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు దేశ విదేశాల్లో ఆశ్రమం ద్వారా అందుతోన్న సేవలు, నిర్వహిస్తున్న కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు.
















