- పాఠశాలల్లో దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్స్
- ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో భేటీలో స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): ఏపీ యువత నూతన నైపుణ్యాల కోసం త్వరలో క్వాంటం టెక్నాలజీ కోర్సులనూ అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈమేరకు టెక్ విద్యార్థులు క్వాంటం, ఏఐ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా వారికి శిక్షణ ఇప్పించడంతోపాటు… పాఠశాల స్థాయినుంచే క్వాంటం టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో డిజిటల్ పద్దతుల ద్వారా విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రతిపాదనలను ఐఐటీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాదినుంచి రెండేళ్లపాటు నాలుగు విడతల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేలా తయారు చేసిన యాక్షన్ ప్లాన్ను ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను సీఎం సమీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఏపీలోని ప్రతి విద్యార్థికి క్వాంటం టెక్నాలజీపై అవగాహన ఉండాలి. రాష్ట్రాన్ని నాలెడ్జి హల్గా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. ప్రైవేట్ విద్యార్థులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకూ క్వాంటం టెక్నాలజీపట్ల అవగాహన ఉండాలి. 7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు క్వాంటంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం పాఠశాలల్లో దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేయండి. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. 2026 జనవరి నెలాఖరులో స్టూడెంట్స్ పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహిస్తాం. ఆ సమ్మిట్లో విద్యార్థులు తమ ఇన్నోవేషన్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేద్దాం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆలోచన కలిగించేందుకు ఇలాంటి సదస్సులు విద్యార్థులకు ఉపకరిస్తాయి. అలాగే క్వాంటంలో స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకోవడం కోసం కేంద్రం చేపడుతున్న నేషనల్ ప్రొగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్యన్స్ అండ్ లెర్నింగ్ వేదికను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 50 వేలమందికి పైగా టెక్ విద్యార్థులకు క్వాంటం నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
2026 జనవరి నెలాఖరులోగా క్వాంటం టెక్నాలజీలో నైపుణ్యాలు కల్పించేలా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి. వివిధ ఐఐటీలు క్వాంటం విషయంలో చేస్తోన్న అధ్యయనాలను కూడా పరిశీలించాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే సమావేశంలో ట్రూ 5జీ సేవల విస్తరణపై బీఎస్ఎన్ఎల్ అధికారులతో సీఎం సమీక్షించారు. సమావేశంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు… ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి, ఐబీఎం సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.














