- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యతాంశాలివే
- 20లక్షల ఉద్యోగాల కల్పనకే మొదటి ప్రాధాన్యత
- స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై సీఎం సమీక్ష
అమరావతి (చైతన్య రథం): స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతీ ప్రభుత్వ శాఖ ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వర్ణాంధ్ర -2047 లక్ష్యాల సాధనకు రూపొందించిన పది సూత్రాలను పది మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖల నోడల్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. మిషన్ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన, ఆయా ప్రభుత్వ శాఖలు మెరుగైన పనితీరు కోసం ముఖ్యమైన ఇండికేటర్లను గుర్తించి వాటికి అనుగుణంగా పనిచేయాలని సీఎం సూచించారు. జీరో పావర్టీ మిషన్లో భాగంగా పీ-4 విధానాన్ని ముందుకు తీసుకెళ్లటంతోపాటు వాటి అమలును విజన్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రతీ కుటుంబమూ సాధికారిత సాధించాలని అలాగే వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించటమే ఈ మిషన్ ముఖ్య లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలని సూచించారు. పాపులేషన్ మేనేజ్మెంట్కు సంబంధించి ఓ విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాలు ఉద్యోగాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. మొట్టమొదటి ప్రాధాన్యతగా 20 లక్షల ఉద్యోగాలను కల్పించటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని సూచించారు. పది సూత్రాలకు సంబంధించిన అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్నారు. కీలక మిషన్ గా నీటి భద్రత అంశంపైనా ప్రధానంగా దృష్టిపెట్టాలన్నారు. నీటి వనరుల సమర్ధ వినియోగంతోపాటు నీటి ఆడిట్ నిర్వహించాలని సూచించారు. నీటి వినియోగంలో ఎక్కడా వివాదాలు లేకుండా చూడాలని.. రెండు తెలుగు రాష్ట్రాలూ సస్యశ్యామలంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు అనే మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలని సూచించారు. టెక్నాలజీ వినియోగంతో… సాగు వ్యయం తగ్గేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిమాండ్ ఆధారిత పంటల ఉత్పత్తి, కోల్డ్ చైన్, ఫుడ్ ప్రాసెసింగ్లాంటి అంశాలపై దృష్టి పెట్టి రైతులకు ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఇండికేటర్ల ఆధారంగా లక్ష్యాలు
రాష్ట్రంలో రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించేలా లాజిస్టిక్స్ రంగాన్ని తీర్చిదిద్దాలని సీఎం స్పష్టం చేశారు. రోడ్లు, రైలు, అంతర్గత జలరవాణా, సీ కార్గో, ఎయిర్ కార్గోలాంటి అంశాలతోపాటు కోల్ట్ చైన్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు లాజిస్టిక్స్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. విద్యుత్, ఇంధన వ్యయాల తగ్గించే అంశంపై కూడా దృష్టి పెట్టాలని ఉత్పత్తిదారు-వినియోగదారు అనే విధానంలో అలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యత అనేది కీలకమైన అంశమని ప్రాడెక్టు పరాక్షన్ తో పాటు మేడ్ ఇన్ ఆంధ్రా బ్రాండ్ను పంచవ్యాప్తం చేసేలా స్పష్టమైన విధానం ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం అరకు కాఫీని పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ బ్రాండ్ చేయగలిగామని సీఎం పేర్కొన్నారు.
ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ జరిగితే మన వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణ అవుతుందని అన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించటంతోపాటు గాలి, నీటి నాణ్యతల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలన్నారు. నెట్ జీరో కాన్సెప్టు పరంగా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు జిల్లాలు మారాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే స్వచ్ఛాంధ్ర
కార్యక్రమానికి సంబంధించి కేంద్ర నిధుల్ని సమర్ధంగా వినియోగించు కోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆర్గానిక్ కూరగాయల ఉత్పత్తి చేయాలని ఆలోచన చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. పౌర సేవలు సులభంగా ప్రజలకు అందేలా ప్రభుత్వ శాఖలన్నీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. ఆర్టీజీఎస్ ద్వారా సమాచారాన్ని సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యాశాఖ వినియోగంలోకి తీసుకువచ్చిన క్వికర్ యాప్ లాంటి వినూత్న ఆవిష్కరణలు అమలు చేయాలన్నారు. సమావేశంలో సీఎస్ విజయానంద్, సహా నోడల్ ఆఫీసర్లుగా ఉన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














