- ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్
- రాజోలు పరిధిలో అభివృద్ధి పనులకు
- వర్చువల్‌లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- అంతర్వేది మంచినీటి పథకం ప్రారంభం
అమారావతి(చైతన్యరథం): ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు..అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలి. భవిష్య త్తుపై నమ్మకం కలిగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి, ఆధ్యాత్మికతతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. గురువారం రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఓఎన్జీసీ నిధులు రూ.5 కోట్లతో 6 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్, అంబేద్కర్ కోనసీమ జల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ రావిరాల, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఈఎన్సీ గాయత్రి పాల్గొన్నారు.
పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందం గా ఉంది. జల్‌జీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ ప్రాజెక్టు 30 వేల మంది తీర ప్రాంత ప్రజల దాహార్తిని తీరు స్తుంది. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామ ర్థ్యం కలిగిన రాపిడ్ శాండ్ ఫిల్టర్ ప్లాంటు, వాటర్ ట్యాంక్ నిర్మిం చాం. ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని వివరించారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకువచ్చి చెరువులో స్టోరేజీ చేయనున్నామని తెలిపారు. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేదిపాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ఈ ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. 30 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో మీ అవసరాలకు తగిన విధంగా స్వచ్ఛ జలాలు సరఫరా చేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం
రూ.5 కోట్ల ఓఎన్జీసీ సీఎసఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామ ర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు లక్షా 20 వేల మందికి పూర్తిస్థాయిలో తాగునీరు అందుతుంది. అలాగే పల్లెపండగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదేరోజు శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో రూ.20.77 కోట్లతో డ్రెయిన్ ఆధు నికీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధాన మంత్రి మోదీ జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయక త్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యాలను ముందుకు తీసుకువెళతామని తెలిపారు.















