- ప్రజల సేవలో ప్రభుత్వం.. కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి
- పార్టీ నేతలకు మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పిలుపు
- ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ నేతలతో టెలికాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సమర్థుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్నికల హామీలన్నీ వేగంగా అమలు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ సహకారంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివ ృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొత్తగా నియమించిన పార్లమెంటరీ స్థాయి అధ్యక్షులతో సోమవారం టెలి కాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళ. బుధవారాల్లో పార్టీ నాయకులందరూ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను నాయకులందరికీ తెలియజేశారు. తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం చేశామన్నారు.
ఈ పథకానికి సుమారు రూ.10,090 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ప్రయాణ భారం తగ్గించామన్నారు. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు… రూ. 6,310 కోట్లు వారి ఖాతాల్లో జమా చేసినట్లు పేర్కొన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కింద ఇప్పటికి రూ.50,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, నేతన్నల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసినట్లు వెల్లడిరచారు. ఇప్పటికే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయలు, కానిస్టేబులు పోస్టులు భర్తీ చేశామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ తో డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం చేస్తున్నామన్నారు. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణం చేశామన్నారు. అవకాశాలను మేరకు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తుందని.. అందరూ ఉత్సాహంగా పని చేయాలని కోరారు. ‘‘ప్రజల సేవలో ప్రభుత్వం’’ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొన్నాలని సూచించారు. మై టీడీపీ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును తెలుసుకోవాలని సూచించారు.
విధ్వంసం నుంచి వికాసం దిశగా..
టెలి కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత నాయకులపై ఉందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అగమ్యగోచరంగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం – అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నామని పల్లా ఉద్ఘాటించారు.















