- పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి
- కూటమి నాయకుల మధ్య సఖ్యత ముఖ్యం
- వైసీపీ దుష్ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలి
- 11వ బ్యాచ్ క్యాడర్ శిక్షణలో నేతలకు మంత్రి లోకేష్ సూచనలు
మంగళగిరి (చైతన్యరథం): పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ క్యాడర్‌కు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ఓర్పుతో, ఐక్యంగా దుష్ప్రచారాలను ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
దుష్ప్రచారాల రాజకీయాన్ని ఎదుర్కోండి
2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా, వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డామని లోకేష్ గుర్తు చేశారు. అదే అప్పటి ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. 2019లో అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టామని, కానీ ప్రతిపక్షం దుష్ప్రచార రాజకీయాలతో అధికారంలోకి వచ్చిందని లోకేష్ అన్నారు. ఇకపై అభివృద్ధితో పాటు, తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను దీటుగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.
కూటమి నాయకుల మధ్య సఖ్యత ముఖ్యం
కూటమి నాయకుల మధ్య సఖ్యత అత్యంత ముఖ్యమని లోకేష్ తెలిపారు. కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా, కూటమిని విడదీయడం ఎవరి తరం కాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో కూటమి నేతలందరినీ కలుపుకుని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు అలగడం తగదని, ప్రతి ఒక్కరి కష్టాన్ని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం అని, కుటుంబంలో సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి
గత వైసీపీ ప్రభుత్వం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతకు, టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిందని లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. చేయకూడని పాపాలు చేసి, ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ దుష్ప్రచారాలతో నిండిపోయిందని,తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండంతో పాటు ఆ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలదేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న సేవలు, కష్టాలను మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో మై టీడీపీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ తరగతులు పార్టీని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
















