- తక్కువ ధరకు ధాన్యం కొనుగోలుపై ఆగ్రహం
- సమస్యపై స్పందించిన మంత్రి కొలుసు పార్థసారథి
- రూ.1550 చెల్లించేలా చూడాలని సూచనలు
విజయవాడ(చైతన్యరథం): కారకంపాడు గ్రామంలో పర్యటించి న మంత్రి కొలుసు పార్థసారథి అనంతరం విజయవాడకు తిరిగి వెళుతున్న సందర్భంగా కొంతమంది రైతులు తాము ఎదుర్కొంటు న్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ రైతులు ధాన్యం రంగు మారిందని చూపిస్తూ రైతు సేవా కేంద్రాల్లో కొను గోలు చేయడం లేదని, ప్రైవేట్ వ్యాపారస్తులు రైతుల నుంచి కేవలం రూ.1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అక్కడి అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యాపారస్తుల లారీల ను ఆపించి విచారణ నిర్వహించారు.
ప్రైవేట్ వ్యాపారస్తులు రూ.1500కి కొనుగోలు చేస్తున్నామని చెప్పినప్పటికీ, వాస్తవంగా రైతులకు కేవలం రూ.1200 మాత్రమే చెల్లిస్తున్నట్లు మంత్రి పరిశీలనలో వెల్లడైంది. దీన్నిబట్టి రైతు సేవా కేంద్ర అధికారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారని స్పష్ట మైంది. మంత్రి ఆదేశాల మేరకు ధాన్యం పరీక్షించే మాయిశ్చరైజర్ యంత్రాన్ని తెప్పించి ధాన్యాన్ని పరీక్షించగా, పై పొరలో రంగు మారినప్పటికీ లోపల బియ్యం నాణ్యత బాగానే ఉందని తేలింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, డీఎంతో పాటు సంబంధిత ఉన్నతాధి కారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు రూ.1250కి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు తప్పనిసరిగా రూ.1550 చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి తక్షణ స్పందనతో న్యాయం జరిగిందని రైతులు కృతజ్ఞతలు తెలిపారు.















