- ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా ప్రైవేటు బీఈడీల్లో అవకతవకలకు అడ్డుకట్ట
- శాసన మండలిలో రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ డైట్, బీఈడీ, బీపీఈడీ కళాశాలలను బలోపేతం చేస్తామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, ఖాళీలను భర్తీ చేసేందుకు తీసుకున్న చర్యలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల వివరాలు, ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో అవకతవకలు నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోటీతత్వ ఆధారిత విద్యకు అనుగుణంగా శిక్షణ విధానాలు, పాఠ్యాంశాల సవరణ గురించి శాసనమండలిలో సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కావలి గ్రీష్మ, బి తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. “డైట్ (జిల్లా విద్యా, శిక్షణ సంస్థ) కళాశాలల్లో ఉన్న ఖాళీలను డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేశాం. కరిక్యులమ్ అప్‌డేట్ విషయంలో కన్సల్టేషన్స్ అన్నీ ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో నిర్వహించాం. ఈనెల 26, 27 తేదీల్లో సెకెండ్ రౌండ్ కన్సల్టేషన్ జరుగుతుంది. అనంతరం నూతన కరిక్యులమ్ రివైజ్ చేసి అమలుచేస్తాం. ప్రధానంగా కాంపిటెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎఫఎలఎన్ ప్రయారిటీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఈథోస్ ఇంటిగ్రేషన్ కీలకమైనవని మేం భావిస్తున్నాం. ఇవి మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలుచేస్తాం” అని సభకు సమాధానమిచ్చారు.
ప్రైవేటు బీఈడీ కళాశాలల విషయంలో.. “ఇప్పటికే ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫఆరఎస్)ను అమలుచేశాం. ఇంజనీరింగ్‌లో కూడా అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నప్పుడు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇంజనీరింగ్‌లోనూ ఎఫఆరఎస్‌ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నాం. సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడాలజీని కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సిన అవసరముంది. ఒకవైపు మనం ఎస్‌సీఈఆర్టీని బలోపేతం చేస్తున్నాం. పాఠశాల విద్యలో కరిక్యులమ్ ప్రతి సైకిల్‌లో అప్‌డేట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరముంది. డైట్స్‌లో కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా చేస్తాం. ట్రైనింగ్ సెంటర్స్‌లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఆదేశాలు జారీ చేశాం” అన్నారు.
“ప్రభుత్వ డైట్, బీఈడీ, బీపీఈడీ కళాశాలల్లో 2019నుంచి 2024వరకు రిక్రూట్‌మెంట్ జరగలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 16వేలమంది ఉపాధ్యాయులను నియమించాం. ప్రతిఏడాది రిటైర్‌మెంట్స్ చూసుకుని ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాం. నైతిక విలువలపై సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమించుకున్నాం. ప్రతివారం నైతిక విలువలపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. దీనిని ప్రతి పాఠశాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పుట్టపర్తి శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా రాగిజావ అందజేస్తున్నాం. అగ్రిమెంట్ కూడా పునరుద్ధరిస్తున్నాం. శ్రీ సత్యసాయి పవచనాలను కూడా పాఠ్యంశాల్లో చేర్చి నైతిక విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలంలో మానసిక ఆరోగ్యం చాలా అవసరం. ఏఐ ద్వారా మానసిక సమస్యలను ముందుగానే గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర విభజనవల్ల ఎంత నష్టపోయామనేందుకు డైట్ కళాశాలలే నిదర్శనం. ఎస్‌సీఈఆర్టీ విభజనవల్ల మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో ఉండిపోయాయి. పదేళ్ల తర్వాత ఎస్‌సీఈఆర్టీని బలోపేతం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 3 డైట్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌గా తీర్చిదిద్దుతాం. మిగతా డైట్ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.





