అమరావతి (చైతన్య రథం): పొలిటికల్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి దష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి వరుసపెట్టి జిల్లా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్, ఎస్పీ సమక్షంలో అన్ని విషయాలపై సమగ్ర చర్చ సాగిస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై నివేదికల ఆధారంగా ఈ సమీక్షలు సాగుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ప్రధాన సమస్యల సత్వర పరిష్కారంపై సమీక్షలలో దష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకు 4 జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షలు ముగిశాయి. ప్రతి రోజూ అసెంబ్లీ అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ స్థితిగతులపై నివేదికల ఆధారంగా సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
అధికారుల పనితీరు, జిల్లాలో పరిస్థితులపై నివేదికల సారాంశం సమీక్షల్లో ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. మండల స్థాయి సమస్యలు, తాగు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ, పరిష్కారం దిశగా చర్యలు, పెండింగ్ నిర్మాణాలు, రోడ్లు, మున్సిపాలిటీల్లో లెగసీ సమస్యలపై చర్చ సాగిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరు అంశాలపై స్పష్టమైన డేటాతో సమీక్షలు జరుపుతున్నారు. 6 -7 నివేదికలు, సర్వేలు, రిపోర్టుల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును లెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. బాగా పనిచేసే ఎమ్మెల్యేలను భేటీలోనే మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తున్నారు. వెనుకబడిన విభాగాల్లో బాగా పనిచేయాలని పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ విభాగాల్లో అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, అధికారులతో ఒకేసారి భేటీ కావడంతో జిల్లాలోని ప్రధాన సమస్యల ప్రస్తావనకు వస్తున్నాయి. చిన్న సమస్యల సత్వర పరిష్కారానికి నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు జారీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసి అందుబాటులో తెచ్చే ప్రాజెక్టులకు వెంటనే నిధుల విడుదల చేయాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. పనిచేయని, సమస్యలు సృష్టిస్తున్న అధికారులను భరించాల్సిన అవసరం లేదని నిర్ద్వద్వంగా చెబుతూనే.. ఇన్‌చార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేస్తున్నారు.














