- అంగన్వాడీ కార్యకర్తలకు 5 జీ సెల్‌ఫోన్లు పంపిణీ
పాలకొల్లు (చైతన్యరథం): అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఉచితంగా 5 జీ సెల్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. పాలకొల్లులోని ఆయన కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గం మొత్తం మీద 224 మందికి కూటమి నాయకులతో కలిసి సెల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సేవల్లో వేగం, పారదర్శకత కోసం అంగన్వాడీ వ్యవస్థలో స్మార్ట్ టెక్నాలజీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,204 అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్ల పంపిణీకి రూ.75 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెరిగాయన్నారు. గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం, ఆర్థిక భద్రత పెరిగిందన్నారు. రాష్ట్రంలో 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు
అంగన్వాడీ కార్యకర్తలపై పని భారం తగ్గించేందుకు యాప్‌ల సంఖ్యను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు డిజిటల్ వ్యవస్థ వినియోగం కీలకమన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజా వేదిక కూల్చివేత ద్వారా విధ్వంస పాలన ప్రారంభించి ఐదేళ్లలో రాష్ట్ర ఖజానాను లూటీ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయాడని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమర్థత గల సీఎం చంద్రబాబు, ఆయనకు అండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి తోడుగా ప్రధాని మోదీల సహకారంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పది,పదిహేను ఏళ్లు పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతాయన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని, జీతాల పెంపు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి రామానాయుడు తెలిపారు.
















