- విద్యాప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత
- ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కెజిబివిల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ దాదాపు 70శాతానికిపైగా పూర్తయింది, ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండరు ప్రారంభమైంది, 6వతేదీ నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత టెక్ట్స్ బుక్స్ పంపిణీ 19నాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
అన్నిపాఠశాలలను త్రీస్టార్ కు చేర్చండి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కనీస మౌలిక సదుపాయాలు కల్పించి త్రీస్టార్ రేటింగ్ కు చేర్చాలని మంత్రి ఆదేశించారు. అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనబడి – మన భవిష్యత్తు కింద రూ.2,034 కోట్లు సమీకరించాలని సూచించారు. ఇప్పటికే రూ.770కోట్లతో వివిధ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి సారించాలని, విద్యాప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది వయోజన విద్యలో గణనీయమైన పురోగతి సాధించడం, అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయడంపై మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విద్యా సంవత్సరంలో 24,74,638మంది వయోజన విద్యాశాఖ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. దీంతో గతఏడాది 73శాతంగా ఉన్న అక్షరాస్యత శాతం 83శాతానికి పెరిగినట్లు చెప్పారు. వచ్చేఏడాది నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 1.95లక్షల మందికి ఉద్యోగాలు
స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ద్వారా ఇప్పటివరకు 1,95,078మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆ శాఖ డైరక్టర్ గణేష్ కుమార్ మంత్రి లోకేష్ కు తెలిపారు. తమ శాఖ ద్వారా 6.87లక్షలమందికి నైపుణ్య శిక్షణ అందించామని, ప్రస్తుతం 71,193మంది శిక్షణలో ఉన్నట్లు చెప్పారు. 26రంగాల పూర్తిస్థాయి సమాచారంతో నైపుణ్యం పోర్టల్ సిద్ధమైనట్లు చెప్పారు. నిర్మాణరంగంలో జాబ్స్ కు సంబంధించి ఈనెల 3వవారంలో 50 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో అమరావతిలో వర్క్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధంగా ఉన్న 87వేలమంది నిర్మాణ కార్మికులకు జాయింట్ సర్టిఫికేషన్, ప్లేస్ మెంట్ పై వర్క్ షాపులో ఎంఓయులు కుదుర్చుంటామని చెప్పారు. అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యాన నిర్మించతలపెట్టిన అమరావతి కన్ స్ట్రక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు సంబంధించిన ప్లాన్లను అధికారులు ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న సిఓఇలను అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. మంగళగిరిలో ఏడాదికి 18వేలమందికి శిక్షణ ఇచ్చే స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
టెక్నాలజీ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో ఇక్కడ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు, డేటా ఆర్కిటెక్చర్ ట్రాన్సఫర్మేషన్, సింగిల్ ఎంట్రీ పాయింట్ ద్వారా సమాచారాన్ని క్రోడికరించే లీప్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాప్ రూపకల్పనపై ఉన్నతవిద్య శాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరును కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సుల అనుమతులను సరళతరం చేసే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నతవిద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్త, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా, స్కిల్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్, పాల్గొన్నారు.













