- అసెంబ్లీకి వచ్చే ధైర్యం మీకు, మీ వైసీపీకి లేదు
- అలవాటుగా నాలుగ్గోడల మధ్య డ్రామాలకే పరిమితం
- ‘హ్యాబిచ్యువల్ అఫెండర’ పద్ధతులు ఇకనైనా మానండి
- ప్రపంచం గేట్స్‌ని చూస్తుంటే.. మీరు బిస్కెట్స్‌ని చూస్తున్నారు
- లోకేష్‌పై విమర్శలు.. మీ ఉనికి కోసమేగా..
- ‘కల్తీ’ రాజకీయాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు
- జగన్ దుర్మార్గ రాజకీయాలపై హోంమంత్రి అనిత నిప్పులు
అమరావతి (చైతన్య రథం): మాజీ సీఎం జగన్‌రెడ్డి వైఖరిపై హోంమంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీకి వచ్చి చర్చించాల్సింది పోయి, ప్రజలను ఎదుర్కోలేక మీడియా వెనుక దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ దుర్మార్గ విధానాలపై విరుచుకుపడ్డారు. “మూడు గంటలపాటు ఏకబిగిన అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన జగన్‌రెడ్డి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించొచ్చు. తన సొంత బ్లూమీడియా (సాక్షి)లో పదే పదే అబద్ధాలు చూపిస్తే.. అవి నిజమైపోతాయనుకోవడం అతని భ్రమ. పోలీసు పరిభాషలో చెప్పాలంటే ఆయనొక ‘హ్యాబిచ్యువల్ అఫెండర’ (అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి). 35 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా ఎదిగిన హెరిటేజ్ సంస్థపై జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తిరుమల లడ్డు కల్తీ అన్న మహాపాపంనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టు కూడా హెరిటేజ్‌పై అసత్య ఆరోపణలు తొలగించాలని ఆదేశించిందన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి” అని హితవు పలికారు. “హెరిటేజ్‌కన్నా రెట్టింపు పాలు సేకరించే ఇందాపూర్ డైరీని హెరిటేజ్ యూనిట్ అని జగన్ అనడం అతని అజ్ఞానానికి నిదర్శనం. హెరిటేజ్ ఎప్పుడూ ట్యాంకర్లతో నెయ్యిని సరఫరా చేయదు. కేవలం కన్స్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తుంది. ఇందాపూర్ నుంచి హెరిటేజ్ కేవలం చీజ్, పన్నీర్‌వంటివి మాత్రమే కొనుగోలు చేస్తుంది తప్ప, నెయ్యి సరఫరాలో ఎటువంటి సంబంధం లేదు” అని వివరించారు.
“2015లో నెయ్యి ధరకి, ఇప్పటి ధరకి తేడా ఏంటని జగన్ ప్రశ్నిస్తున్నారు. భారతీరెడ్డిని అడగండి.. సాక్షి పేపర్ ధర అప్పట్లో ఎంత? ఇప్పుడు ఎంత? భారతీ సిమెంట్ ధర అప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? 2015లో పాల ప్యాకెట్ ధర రూ.19 ఉంటే, ఇప్పుడు రూ.40 ఉంది. పాలు ధర పెరిగినప్పుడు నెయ్యి ధర పెరగదా? పాలేలేకుండా నెయ్యి తీసే టెక్నాలజీ కేవలం తాడేపల్లి ప్యాలెస్‌కే సొంతం” అని అనిత ఎద్దేవా చేశారు. “బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ వేరు. స్కామ్‌లో ఉన్న బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ వేరు. కనీసం రిజిస్ట్రేషన్ నెంబర్లు, కంపెనీ స్థాపించిన సంవత్సరాలు చూసుకోకుండా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. జగన్‌రెడ్డి తన ముఖానికి మసి అంటుకుంటే అద్దాన్ని తుడుస్తున్నారే తప్ప, తన ముఖం తుడుచుకోవడం లేదు. ఆరు నెలలు సావాసం చేస్తే వీళ్లు వాళ్లవుతారన్నట్టు.. జగన్‌రెడ్డి దగ్గర ఉండి బొత్స కూడా అలాగే తయారయ్యారు.
మీడియా ముందు చీజ్ ప్యాకెట్ చూపిస్తూ అది నెయ్యి అని చెప్పడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. కనీసం ఆ రెండింటికీ తేడా తెలియని స్థితిలో ఉన్నారా?” అని ప్రశ్నించారు. బోలే బాబా పేరుతో ఉన్న రెండు కంపెనీలను ఒకటిగా చూపించి జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ 2004లో స్థాపించబడింది. ఇది ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ 2020లో (వైసీపీ హయాంలో) స్థాపించబడింది. స్కామ్‌లో ఉన్నది, సీబీఐ చార్జ్ షీట్‌లో నిందితుడిగా ఉన్నది ఈ కంపెనీయే. కంపెనీల పేర్లు ఒకేలా ఉన్నంత మాత్రాన అన్నీ ఒకటే అయిపోవు. హెరిటేజ్ ఏ ఊరిలో ఉన్నా దాని సీఈవో, డైరెక్టర్లు వాళ్లే ఉంటారు. కానీ ఈ బోలే బాబా కంపెనీల రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఎనఐసి కోడ్‌లు, చివరకు యజమానులు కూడా వేరు. స్కామ్ చేసిన వారు జైన్ అయితే, సరఫరా చేయని వారు అగర్వాల్స్. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఈ చిన్న లాజిక్, సీఐఎన్ నెంబర్లు చూడటం తెలియకపోవడం విచారకరం. ఏదో వెంకటేశ్వర అని పేరు ఉంటే రాష్ట్రంలో ఉన్న వెంకటేశ్వర కంపెనీలన్నీ ఒకటేనా? సూట్ కేస్ కంపెనీలు నడిపే మీకు, సిస్టమాటిక్‌గా వ్యాపారం చేసే కంపెనీల విలువల గురించి ఏం తెలుస్తుంది? కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. మీరు ఏవో కాగితాలు పట్టుకుని ఆధారాలు అని గొప్పలు చెప్పుకున్నారు కదా. అందుకే మేము ఈ క్లారిటీ ఇస్తున్నాం. నిజంగా మీకు దమ్ముంటే చర్చకు రండి, మీ అజ్ఞానాన్ని ప్రజల ముందు ఉంచుతాం” అని హోంమంత్రి అనిత తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
తిరుమల లడ్డులో రసాయనాల ముద్ద కలిసింది నిజమని సిట్ రిపోర్ట్, ఎన్‌డీడీబీ రిపోర్ట్ తేల్చి చెప్పాయి. సాక్షాత్తు మీ బాబాయి వైవీ సుబ్బారెడ్డే మీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. మరి కల్తీ జరిగిందని తెలిసినప్పుడు ఆ టెండర్లను ఎందుకు రద్దు చేయలేదు? టెండర్ నిబంధనలను ఎందుకు నీరుగార్చారు?” అని హోంమంత్రి ప్రశ్నించారు. నెయ్యి కావాలంటే పాలు ఉండాలి జగన్ రెడ్డి! కానీ మీరు పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేదనేలా టెండర్ కండిషన్లు మార్చేశారు. రూ.250 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనను రూ.150 కోట్లకు ఎందుకు తగ్గించారు? మీ అనుకూల కంపెనీలకు దోచిపెట్టడానికే ఈ మార్పులు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. కల్తీ గురించి మాట్లాడమంటే.. హెరిటేజ్, ఇందాపూర్ అంటూ సంబంధంలేని విషయాలను లాగుతున్నారు. జగన్‌రెడ్డి.. ఆధారాలు లేవని పదే పదే అబద్ధాలు ఆడుతున్నారు. దమ్ముంటే ఒకసారి సిట్ రిపోర్ట్ చదవండి. అది ఇంగ్లీష్‌లో ఉంటే ఎవరినైనా అడిగి తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయించుకోండి. రూ.250 కోట్ల స్కామ్ జరిగిందని, రసాయనాల ముద్ద లడ్డూలో కలిసిందని రిపోర్టులు క్లియర్‌గా చెబుతున్నాయి. మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డే కల్తీ జరిగిందని ఒప్పుకున్నాక కూడా మీకు ఇంకేం ఆధారాలు కావాలి?” అని నిలదీశారు.
ప్రపంచం గర్వించే బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వస్తే అది మనందరికీ గర్వకారణం. కానీ మీ గ్యాంగ్ ఆ స్థాయిని విస్మరించి.. ఆయన తాగిన టీ ఖర్చు, తిన్న బిస్కట్స్ ఖర్చు గురించి మాట్లాడుతోంది. మీస్థాయి ఏంటో అక్కడే అర్థమైపోయింది. టెర్రరిజాన్ని అరికట్టవచ్చు కానీ, మీలాంటి ‘కల్తీ టెర్రరిస్టులను’ అరికట్టడం ప్రజలకే సాధ్యం. నారా లోకేష్ తన సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్ కొనుక్కుని, తన సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే మీకెందుకు అంత అక్కసు? ఆయన నిన్న మ్యాచ్ చూసి, ఆ రోజు ఉదయాన్నే బిల్ గేట్స్‌ను రిసీవ్ చేసుకుని, ఆయనతో కలిసి ఇన్నోవేషన్స్ గురించి చర్చించారు. యువ నాయకుడిగా ఆయన ఎదుగుతుంటే చూసి నేర్చుకోండి తప్ప, ఇలా బురద చల్లకండి. లోకేష్‌కు క్రీడా స్ఫూర్తి ఉంది కాబట్టే.. వరల్డ్ కప్ సాధించిన మహిళా క్రికెటర్లను ఇంటికి పిలిచి, 2 కోట్ల నగదు, ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చి సత్కరించారు. మీరు జనాలు ఓడగొడితే ఇంట్లో కూర్చుని టీవీలో మ్యాచ్‌లు చూస్తున్నారు. ఆయనను జనాలు గెలిపిస్తే బయటకి వెళ్లి ప్రజల కోసం పని చేస్తూ సరదాగా మ్యాచ్ చూస్తున్నారు. ఆ తేడా గమనించండి. తప్పులు చేసిన వాళ్లు తమ మీద ఉన్న బురదని పదిమందికి అంటించాలని చూస్తారు. జగన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, మీ ‘హ్యాబిచువల్ క్రిమినల’ మెంటాలిటీకి ప్రజలే బుద్ధి చెబుతారు” అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
“మేము చర్చకు సిద్ధమని మూడు రోజులుగా మొత్తుకుంటున్నాం. మీవాళ్లు కౌన్సిల్‌లో గొడవ చేసి బయటికి వచ్చి చర్చకు అవకాశమివ్వమని డ్రామాలాడుతున్నారు. అక్కడ కూర్చున్న చైర్మన్ మీ పార్టీ వ్యక్తి కాదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సభకు వచ్చి మాట్లాడండి. ఆధారాలు లేకుండా థంబ్‌నైల్స్ రాజకీయాలు చేయడం మానుకోండి. మా పాలన ఎలా ఉందో ప్రజలను అడగండి. తల్లికి వందనం అందుకుంటున్న తల్లులను అడగండి. దీపం పథకం కింద సిలిండర్లు పొందుతున్న గృహిణులను అడగండి. 16,000 డిఎస్సీ పోస్టులు, 5,700 కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన యువతను అడగండి. దేశంలోనే అత్యధికంగా రూ.4,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆదివారం వచ్చినా సరే ముందు రోజే పెన్షన్ అవ్వతాతల చేతిలో పెడుతున్న ప్రభుత్వం మాది. జగన్.. మీరు మూడు గంటలు మాట్లాడినా అందులో ఒక్కటంటే ఒక్క నిజం లేదు. తప్పులు చేసి ఇతరులపై నెట్టేసే మీ ‘హ్యాబిచువల్ క్రిమినల’ బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అది మాకంటే మీకు బాగా తెలుసు కాబట్టే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ధర్మమెప్పుడూ గెలుస్తుందని, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారు శిక్ష అనుభవించక తప్పదు” అని హోంమంత్రి అనిత తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
















