- సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో నిధులు
- ప్రాధాన్యతలపై ఆర్థిక శాఖ కసరతు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈనెల 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా వరుసగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు పూర్తయ్యాయి. మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, అనితలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు, ప్రాధాన్యతలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. వివిధ శాఖల మంత్రులు తమ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రికి సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధికి సమపాళ్లలో నిధులు కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను రూపొందిస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించేలా బడ్జెట్ కూర్పు సాగుతోంది.
పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిం చేందుకు ప్రత్యేక కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో ఖాతాలు తెరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. వివిధ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.రోడ్ల అభివృద్ధిపైనా ఈ బడ్జెట్లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పాత హోల్స్ రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణానికి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. హార్టికల్చర్ రంగ అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు, లాజిస్టిక్స్ సెక్టార్ వృద్ధిపై సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టనుంది. అంతేకాకుండా, జల్ జీవన్ మిషన్ పథకాన్ని వేగవంతం చేసేందుకు తగిన ప్రణాళికలు, నిధుల కేటాయింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం చర్చలు జరిపారు. అలాగే మిగిలిన శాఖల మంత్రులతోనూ త్వరలో సమావేశాలు జరపనున్నారు.
హోంమంత్రి వంగలపూడి అనితతో సమావేశం
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై హోమ్ శాఖను మరింత పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సెక్రటరీలు వినయ్కుమార్, రోనాల్డ్ రాస్, జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ, హోమ్ శాఖ సెక్రటరీ విజయ్కుమార్, అడిషనల్ డీజీ శ్రీ మధుసూదన్ పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
















