- నడిమివంక, మరువవంక ప్రొటెక్షన్ వాల్స్‌కు నిధులివ్వండి
- మున్సిపాల్టీల అభివృద్ధికి సహకరించండి
- శిల్పారామంలో సమస్యల పరిష్కారానికి కృషి
- సోలార్ పార్కు ఏర్పాటుకు అనుమతివ్వండి
- అర్బన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే దగ్గుపాటి విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు
ఉండవల్లి (చైతన్య రథం): అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కీలకమైన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. బుధవారం అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇన్‌ఛార్జి మంత్రి టీజీ భరత్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు జేసి అస్మిత్‌రెడ్డి, గుమ్మనురు జయరాం, బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న పనులకు సంబంధించి ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. తర్వాత ఆయన్ని ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో నడిమివంక, మరువవంకలకు ప్రొటెక్షన్ వాల్స్‌కి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారీవర్షాల సమయంలో ఈ వంకలు పొంగి చాలా కాలనీలు నీట మునుగుతున్నాయని.. అందుకే వీటికి రక్షణ గోడలు నిర్మించాలన్నారు. ఇందుకు సంబంధించి జల వనరులశాఖ రూ.79.46కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. అలాగే నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు 2023లో రూ.25కోట్లు అంచనా పనులు చేపట్టారన్నారు.
అప్పట్లో కేవలం రూ.6.165కోట్లు మంజూరు చేశారన్నారు. మిగిలిన రూ.18.84 కోట్లతో రోడ్లు, రక్షితనీటి సరఫరా, వీధిలైట్లు, టాయిలెట్ సౌకర్యాలువంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. వాటికి సంబంధించిన నిధులు కేటాయించాలని కోరారు. అలాగే నగర శివారులోని శిల్పారామాన్ని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అక్కడ చాలా సమస్యలు నెలకొన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఇక్కడ మరమ్మతులు, పరికరాల భర్తీ, పార్కులో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9.95కోట్లు కేటాయించాలని కోరారు. మరోవైపు అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి కూడేరు మండలం ముద్దలాపురంలో 16ఎకరాల భూమి ఉందని.. అక్కడ సోలార్ పార్కు ఏర్పాటుకు రూ.16 కోట్ల రూపాయులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అన్నింటికీ సంబంధించిన ప్రతిపాదన పత్రాలను కూడా సీఎంకు అందజేశారు. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వీటికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
















