- ప్రభుత్వ పాఠశాలలపట్ల దృక్పథం మార్చుకోవాలి
- 2029నాటికి దేశంలో నెం.1గా ఏపీ విద్యా వ్యవస్థ
- పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదన్నది మా విధానం
- విద్యతోపాటు నైతిక విలువలూ విద్యార్థులకు అలవడాలి
- భామిని మెగా పీటీఎంలో విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
పాలకొండ (చైతన్య రథం): ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపుంది. ఆ మైండ్‌సెట్ మారాల్సిన అవసరం ఉంది. 2029కల్లా రాష్ట్రంలో విద్యారంగాన్ని నెం.1 చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీతో జోడిరచి మెరుగైన విద్యను అందిస్తా. మూడేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేసేందుకు కృషిచేస్తామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పాలకొండ నియోజకవర్గం భామిని ఏపీ మోడల్ స్కూలులో నిర్వహించిన మెగా పీటీఎం 3.0లో సీపం చంద్రబాబుతో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘‘తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం. ఇవి ప్రతి ఒక్కరు తీర్చాల్సినవి. శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మాస్టారు ఒక గొప్ప మాట చెప్పారు. మనం తీర్చాల్సిన ఇంకో ముఖ్యమైన రుణం ఉందన్నారు. అదే సామాజిక రుణం. సమాజం మనకి ఎంతో ఇస్తోంది. సమాజానికి మనం ఎంతోకొంత తిరిగి ఇవ్వాలి. బడిని బాగుచేసి సామాజిక రుణం తీర్చుకుందాం. ఆయన ఇప్పుడు మనమధ్య లేరు. కానీ, ఆయన రాసిన కథలు, లక్ష కథలతో అయన ఏర్పాటు చేసిన కథానిలయం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మన కారా మాష్టారు. ఆయన గురించి మీరంతా తెలుసుకోవాలి’’ మంత్రి లోకేష్ ఉద్భోదించారు.
అంతాకలసి బడిని బలోపేతం చేద్దాం
‘‘దేశ భవిష్యతు క్లాస్‌రూమ్ నుండే ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బలంగా నమ్ముతారు. ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను ఇవ్వాలనేది మన సీఎం కల. అయన కల నేరవేరాలంటే విద్యావ్యవస్థకు పూర్వ వైభవం తేవాలి. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. బడిని బలోపేతం చెయ్యాలి. అందరిని బడితో అనుసంధానం చేయాలి. అదే లక్ష్యంతో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్ధులు, దాతలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసే వేదిక మెగా పిటిఎం ప్రారంభించాం. మొదటి మెగా పిటిఎం బాపట్లలో చేసాం. రెండో మెగా పిటిఎం సత్యసాయి జిల్లాలో చేసాం. మూడో మెగా పిటిఎం పార్వతీపురం మన్యం జిల్లాలో చేస్తున్నాం. ఈ మూడు మెగా పిటిఎం కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. అభివృద్ది వికేంద్రికరణ ఎలా చేస్తున్నామో అన్ని ప్రాంతాల్లో విద్యపై కూడా ఫోకస్ పెట్టాం’’ అని వివరించారు.
ఎన్ని పనులున్నా పీటీఎంకు వెళ్తా
‘‘పిల్లలు దేవుడితో సమానం. పిల్లలు మన భవిష్యతు. పిల్లలంటే నాకు బాగా ఇష్టం. అందుకే నేను విద్యాశాఖ ఎంచుకున్నా. మిమ్మల్ని చూస్తే నా పీటీఎం గుర్తుకు వస్తోంది. క్లాస్‌లో మాది అల్లరి బ్యాచ్. మాక్లాస్ టీచర్ ఎప్పుడూ అమ్మకి కంప్లయింట్ చేసేది. మా నాన్న నా పీటీఎంకు రాలేదు. మీ పీటీఎంకి సీఎం వచ్చారు. మీరంతా అదృష్టవంతులు. ఎంత పని వత్తిడి ఉన్నా దేవాన్ష్ పీటీఎంకు వెళ్తా. పిల్లలు ఇంత కాన్ఫిడెన్స్‌గా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయా. మన పిల్లలు అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు’’ అని మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
ఒక తల్లికష్టం రాష్ట్రానికి సీఎంని చేసింది
చదువు విలువ గురించి మీకు ఒక కథ చెప్తాను. ఆ కాలంలో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలిస్తున్నారు. ఒక అబ్బాయి తల్లి కష్టపడి కొడుకుని చదివించారు. ఒకసారి కొడుకుకి మూడు రూపాయలు ఫీజు కట్టాలి. ఆమె దగ్గర డబ్బులు లేవు. తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన పట్టుచీర తాకట్టుపెట్టి ఫీజు కట్టారు. తల్లిపడిన కష్టానికి ఫలితం దక్కింది. తల్లి కష్టపడటం చూసిన కొడుకు కష్టపడి చదివాడు. బారిస్టర్ అయ్యాడు, ఒక పేపర్‌కి ఎడిటర్ కూడా అయ్యాడు. స్వాతంత్య్ర సమరయోధుడుగా మారి బ్రిటిష్ వాళ్ళను ఎదురించాడు. స్వాతంత్య్రం వచ్చాక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. స్వాతంత్య్రం రాకముందే చదువు విలువ తెలుసుకున్న ఆ తల్లి పేరు సుబ్బమ్మ. ఇది పిల్లలంతా మర్చిపోకూడదు. మనం ఈస్థాయికి రావడానికి తల్లిదండ్రుల త్యాగాలున్నాయి. మనకు జ్వరం వస్తే వారు బాధపడతారు. వారి కలలను నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని పిల్లలకు ఉద్భోదించారు.
విద్యతోపాటు నైతిక విలువలూ ముఖ్యమే
‘‘పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే విద్య ఒక్కటే సరిపోదు. నైతిక విలువలు కూడా ఉండాలి. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలు నేర్పడానికి సలహాదారుగా నియమించారు. చాగంటి కేబినెట్ ర్యాంకు ఇచ్చినా ప్రభుత్వ వాహనం, ఫోన్ వాడటం లేదు. విద్యార్థుల కోసం ఆయన నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించారు. 6వ నుండి 10వ తరగతి పిల్లలకు నైతిక విలువల పాఠాలు చెబుతున్నాం. విజయవాడలో విలువల విద్యా సదస్సు ఏర్పాటు చేసాం. ఎవరైనా అరగంట మాట్లాడితే బోర్ కొడుతుంది. కానీ చాగంటి గారు మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన మాట్లాడుతుంటే 2 గంటలు పాటూ నేను, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంతా అలా వింటూ ఉండిపోయాం. తల్లి ప్రేమ, నాన్న త్యాగం, గురువు గొప్పతనం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆయన ఒక గొప్ప మాట చెప్పారు. మన తల్లితో చెప్పుకోలేని పనులు మనం అస్సలు చెయ్యకూడదని అన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం.. మొన్న పుట్టపర్తిలో సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్నాను. గ్రౌండ్‌లో వేలమంది విద్యార్థులు కింద 3 గంటలు కూర్చున్నారు. ప్రోగ్రామ్ అయ్యక అంతా లేచి నీట్‌గా గ్రౌండ్ క్లీన్ చేసి వెళ్ళారు. ఒక్క పేపర్ ముక్క కూడా లేదు. మనం కూడా మన స్కూల్స్‌ని అంతే నీట్‌గా ఉంచుకోవాలి’’ అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
స్టూడెంట్ అసెంబ్లీలో అద్భుత ప్రదర్శన చేశారు
‘‘రాజ్యాంగ దినోత్సవం రోజు అమరావతిలో నిర్వహించిన స్టూడెంట్ అసెంబ్లీలో విద్యార్థులు అద్భుత పనితీరు కనబర్చారు.మాక్ అసెంబ్లీలో శాసనసభ్యులకన్నా అద్భుతంగా మాట్లాడి మా అందరికీ దశ,దిశ ఇచ్చారు. ప్రతిఒక్కరూ మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. మహిళలను కించపర్చే పదాలు గాజులు తొడుక్కున్నావా? చీరకట్టుకున్నావా? అమ్మాయిలా ఏడవొద్దు వంటి పదాలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. విద్యామంత్రి లోకేష్ అలాంటివి వాడొద్దని చెప్పాడని చెప్పండి. మహిళలను మగవారితో సమానంగా గౌరవించినపుడే సమాజం అభివృద్ధి సాధిస్తుంది. నిజమైన మార్పు ప్రాధమిక పాఠశాల నుంచే మొదలవుతుంది. రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు ఇచ్చింది. అవి మీకు తెలియాలని బాలల భారత రాజ్యాంగం పుస్తకం తెచ్చాం. ఆ పుస్తకం అందరూ చదవాలి’’ అని మంత్రి లోకేష్ సూచించారు.
రాజకీయాలకు అతీతంగా స్కూళ్లు
‘‘పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదన్నది మా విధానం. అందుకే ఇప్పుడు స్కూళ్లలో ఎక్కడా ఎక్కడా సిఎం, డిప్యూటీ సిఎం, నా ఫోటో లేదు. విద్యను రాజకీయాలను దూరంగా పెట్టాలన్న సిఎంగారి ఆదేశాలను అమలు చేస్తున్నాం. ఇప్పుడు స్కూళ్లకు రాజకీయ పార్టీల రంగులు లేవు. పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలు లేవు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్టూడెంట్ కిట్స్ ఇస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తెచ్చాం. క్లిక్కర్ టెక్నాలజీ తీసుకువచ్చాం. ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్ ల్యాండ్, సింగపూర్ పంపాలని ఆదేశించారు. అక్కడ నేర్చుకొని ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో అందించే బాధ్యత తీసుకుంటా. లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు, అటెండెన్స్, ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుంది. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులు, పిల్లలను అనుసంధానం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
సంస్కరణలు అమలు చేస్తున్నాం
‘‘రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు తెచ్చాం. 9600 పాఠశాలల్లో వన్ క్లాస్ %-% వన్ టీచర్ విధానాన్ని అమలుచేస్తున్నాం. కరికులంలో మార్పులు చేసాం. టీచర్ ట్రాన్సఫర్ యాక్ట్ తీసుకొచ్చి పారదర్శకంగా బదిలీలు చేశాం. మౌలిక సదుపాయాల నుండి ఫలితాల వరకు పాఠశాలలకు స్టార్ రేటింగ్‌లు ఇచ్చాం. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకొచ్చాం. గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్ ఎన్ టార్గెట్ గా పెట్టుకున్నాం. స్కూల్స్ లో మానసిక ఆరోగ్యం, కెరీర్ కౌన్సిలర్లను నియమించాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. ఇన్ సర్వీస్ టీచర్స్ కు టెట్ ఐచ్ఛికం చేశాం. ఇన్నోవేటివ్ టీచర్స్ ను గుర్తిస్తున్నాం. మా అంతిమ లక్ష్యం విద్యార్థి అభ్యాస ఫలితాలు. లీప్ యాప్‌లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయం ఇవ్వండి’’ అని కోరారు.
పవనన్న సలహాలు ఇస్తున్నారు
‘‘విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు నాకు పవనన్న సలహాలు ఇస్తున్నారు. స్కూళ్ల స్థితిగతులపై డిస్కస్ చేస్తున్నాం. టీమ్ వర్క్ గా పనిచేస్తున్నాం. పవనన్నకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. విద్యావిధానంలో సంస్కరణలు తేవాలనుకున్నపుడు టీచర్ ట్రాన్సఫర్ యాక్ట్‌పై 30నిమిషాలు చర్చ జరిగింది. యువకులం, ఉత్సాహవంతులం, మేం మిసైల్ అయితే చంద్రబాబు జిపిఎస్ లాంటివారు. ఆయన మాకు దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూ, బెల్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు, నాణ్యమైన విద్య లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలు, పాటలు, యోగా -అన్నీ ఉంటాయి. పదోతరగతి, ఇంటర్ లో ప్రతిభ కనబర్చిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డ్లు కూడా ఇచ్చాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఏపీ ప్రజలు గర్వపడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ రాష్ట్ర కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, భామిని ఏపీ మోడల్ స్కూలు ప్రధానోపాధ్యాయులు జి.బాబూరావు, పాఠశాల ఎస్‌ఎంసి చైర్మన్ వానపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.











