- రాష్ట్రంలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత
- నీటి సంరక్షణకు వంద రోజుల యాక్షన్ ప్లాన్
- వాటర్ బడ్జెట్- వాటర్ ఆడిట్ కీలకాంశాలు
- కాల్వలు, చెర్వులు, చెక్ డ్యాంలు బాగు చేసుకోవాలి
- మరింత నీటి నిల్వకు రాష్ట్రాన్ని సన్నద్ధం చేయాలి
- భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి
- నీటి భద్రత.. సాగునీటి సంఘాల ప్రధాన బాధ్యత
- సాగునీటి సంఘాలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో నీటి భద్రత సాధిస్తే ఇతర రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కరవురహితంగా చేయటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని.. వేసవికంటే ముందు 6 మీటర్లు, వర్షపు సీజన్ పూర్తయ్యేనాటికి 3 మీటర్ల లోతులో భూగర్భజలాలు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. ఈనెల 6నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సాగునీటి సంఘాలు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయితీరాజ్, అటవీ, పశు సంవర్థక శాఖలు సంయుక్తంగా జల సంరక్షణ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుకెళ్లాలని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణ- జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించారు. సాగునీటి సంఘాలు కేంద్రీకృతంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలోని 60 వేలమంది సాగునీటి సంఘాల సభ్యులకు కార్యక్రమ నిర్వహణ చేప్టటే కీలక బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు.
నీటి భద్రత అంశంలో ప్రజలను భాగస్వాములను చేయాలని… దీన్నో ప్రజా ఉద్యమంగా మలచాలని దిశానిర్దేశం చేశారు. ఈమేరకు ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు నాలుగు దశల కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏప్రిల్ 6నుంచి ఏప్రిల్ 15వరకు పనుల గుర్తింపు కార్యక్రమం చేపట్టాలని… ఏప్రిల్ 16నుంచి 20వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఏప్రిల్ 21నుంచి జూలై 9వరకు పనుల కార్యాచరణ చేపట్టాలని… జూలై 10నుంచి జూలై 14 మధ్య పూర్తిచేసిన పనులకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని సీఎం సూచించారు. నీటి పొదుపును కీలకాంశంగా తీసుకుని.. ప్రతీ నీటి బొట్టనూ ఒడిసిపట్టేలా చూడాలన్నారు. రాష్ట్రస్థాయినుంచి క్షేత్రస్థాయి వరకూ నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాదని.. సామూహిక బాధ్యతగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు.
ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతీ రైతుకు భరోసా ఇవ్వటం లక్ష్యంగా కార్యక్రమం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో సాగునీటి సంఘాలు, గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో కార్యక్రమం అమలు కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ విధానపరమైన అంశాలను పర్యవేక్షించాలని… జిల్లా, క్షేత్రస్థాయిలో కలెక్టర్ సహా సర్పంచ్ అధ్యక్షతన పనులు చేపట్టాలని ఆదేశించారు. సాగునీటి సంఘాలు దీనికి డ్రైవింగ్ ఫోర్సుగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5697 గ్రామాల్లో భూగర్భజలాల ఎద్దడి ఉన్నట్టు గుర్తించామని ముఖ్యమంత్రి పేర్కోన్నారు. అన్ని చెరువులూ నింపి భూగర్భ జలమట్టాన్ని కనీసం 1.5 మీటర్లమేర పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. “నీటిని నిల్వ చేయాలి. పొదుపు చేయాలి. మైక్రో ఇరిగేషన్ అమలు చేయాలి. ప్రతి చుక్కను సమర్థంగా వినియోగించుకోవాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రాజెక్టు జలధార స్ఫూర్తిగా…
ఉపగ్రహ చిత్రాల ఆధారంగా శాస్త్రీయంగా చెరువుల మ్యాపింగ్ చేయటంతోపాటు హైడ్రాలజీ మ్యాప్‌ను కూడా విశ్లేషించి అనుసంధాన ప్రక్రియను చేపట్టాలన్నారు. సాగునీటి సంఘాలు వాటర్ బడ్జెట్‌ను తయారు చేయటంతో పాటు వాటర్ ఆడిట్ కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఫీడర్ ఛానెళ్లను క్లియర్ చేయాలి. పూడిక తీత పనులు చేపట్టాలని సీఎం సూచించారు. గుర్రపు డెక్కను తొలగించి.. చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. అప్పుడే ఎక్కువ నీటిని సంరక్షించుకోవచ్చని, ముంపును అరికట్టవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అవసరమైన మేరకు చెక్ డ్యాంలను రిపేర్లు చేయాలి. కొత్త స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. భూగర్భజలాలు మరీ తక్కువగా ఉన్నచోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సాగునీటి సంఘాలకు ముఖ్యమంత్రి సూచించారు. అన్నమయ్య జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టు జలధార స్పూర్తిగా వాగులు, వంకలు, ఇతర నీటి వనరుల్ని అనుసంధానించాలన్నారు. ఎక్కడికక్కడ జల సంరక్షణా చర్యలు చేపట్టి.. ప్రతీ నీటి చుక్కనూ ఒడిసి పట్టాలని సూచించారు. నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణను అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత పాలకులు ఈ సంరక్షణా చర్యల్ని పక్కన పడేశారని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఈ వందరోజుల యాక్షన్ ప్లాన్‌ను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. కార్యక్రమంలో రైతులను, ప్రజల్ని భాగస్వాములను చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
















