విశాఖపట్నం (చైతన్య రథం): పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖ చేరుకున్న విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 77వ ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారినుంచి అర్జీలు స్వీకరించారు. స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని (స్టీల్ ప్లాంట్) ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతోపాటు పెండిరగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ విమల విద్యాలయం స్కూల్స్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్పేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో సిబ్బంది మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ స్టాఫ్‌కు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. తన తండ్రికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని దివకాల గంగారాజు ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖ అంబేద్కర్ కాలనీకి చెందిన ఈర్ల అప్పలరాజు మంత్రి నారా లోకేష్‌ను కలిసి కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్‌వాలిడేషన్ స్కీమ్‌ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, పెండిరగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు (కన్నబాబు) ప్రోద్బలంతో తనపై నమోదు చేసిన రౌడీషీట్‌ను ఎత్తివేయాలని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల వివేక్ కోరారు. ఆయా వినతులను పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.













