అమరావతి (చైతన్య రథం): ప్రపంచానికే ఆరాద్యదైవమైన వెంకన్నతో పెట్టుకోవద్దంటూ వైసీపీ నాయకుడు జగన్‌రెడ్డిని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం మండలిలో తిరుపతి వెంకన్న ఫొటోలు పెట్టుకుని వైసీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించిన తీరుపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. “శ్రీవారికి చేసిన మహాపాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేసావు జగన్. మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. హిందువుల మనోభావాలంటే లెక్కేలేదు. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతేకాకుండా కౌన్సిల్‌లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్ళిపోవడం క్షమించరాని పాపం. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన” అని
ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ శాసనమండలిలో శుక్రవారం ఉదయం గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ ద్వారా తితిదేకు నెయ్యి సరఫరాపై చర్చించాలని వైకాపా సభ్యులు రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ కొయ్యొ మోషేను రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైకాపా ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. వైకాపా ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుని ఫొటో పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో నిరసన తెలపడంపై అధికారపక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరం తెలిపారు.















