- యూనిట్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉంది
- అమరావతిలో ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు పరిశీలించండి
- ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురకు మంత్రి లోకేష్ ప్రతిపాదన
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్‌ఏ, చైతన్య రథం): ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ శాంటాక్లారాలోని కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెమీకండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉంది. విశాఖపట్నం -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) పరిధిలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలతోపాటు మాకు బలమైన రాజకీయ సంకల్పం ఉంది. ఇది సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇంటెల్ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రభావం మా రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్‌ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. ఇంటెల్ స్థాపనతో యాన్సిలరీ సప్లయర్స్, కాంపోనెంట్ తయారీ సంస్థలు రాష్ట్రంలో ఆకర్షితమవుతాయి’’ అని ప్రతిపాదించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్ జెన్ టెక్నాలజీ నాయకత్వం సాధించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇంటెల్ ఏఐ హార్డ్ వేర్ (ఉదా: హబానా ల్యాబ్స్, గౌడి యాక్సిలేటర్స్), హెచ్‌పీసీ, ఎడ్జ్ కంప్యూటింగ్ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. ‘‘ఇంటెల్ -అమరావతి ఏఐ రీసెర్చ్ సెంటర్’’ను శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ లేదా ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. ఇంటెల్ ఆధారిత హెచ్‌పీసీ క్లస్టర్లు ఏర్పాటు చేసి విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య, వ్యవసాయం, వాతావరణ నమూనా పరిశోధనలకు మద్దతు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషిచేస్తున్న నేపథ్యంలో ఇంటెల్ భవిష్యత్ నైపుణ్య వర్క్ ఫోర్స్ అవసరాన్ని తీర్చేందుకు ప్రపంచ ప్రసిద్ధ శిక్షణ కార్యక్రమాలను చేపట్టండి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పాఠ్యప్రణాళికలో ఇంటెల్ శిక్షణా కార్యక్రమాలు (ఉదా: ఇంటెల్ డిజిటల్ రెడీనెస్, ఏఐ ఫర్ యూత్) చేర్చే అంశాన్ని పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్‌లోని వర్శిటీల్లో ‘‘ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్’’ స్థాపించి… విఎల్‌ఎస్‌ఐ డిజైన్, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ మూలాలు, ఏఐ, రోబోటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించండి. ఆర్ అండ్ డి సంస్కృతిని పెంపొందించడానికి, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లను సంయుక్తంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయండి’’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. (సెమీ కండక్టర్స్ చిప్, జిపియు, సిపియు డిజైనింగ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంటెల్ సంస్థ… 180 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది.)














