- వలసల నుంచి త్వరలోనే రివర్స్ మైగ్రేషన్
- డేంజర్‌బెల్స్‌ను ఊహించే పాపులేషన్ మేనేజ్మెంట్
- ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026లో సీఎం చంద్రబాబు
ఢిల్లీ (చైతన్య రథం): అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారని స్పష్టం చేశారు. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్‌లాంటి సంస్కరణల్ని మొదటగా అందిపుచ్చుకోవటంవల్లే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం వివరించారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో ‘సాంకేతికత -సుపరిపాలన -భవిష్యత్తు’ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. సహకార సమాఖ్య దేశంగా కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం వివరించారు. ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనని.. డిప్లొమసి, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో వారికి మంచి పేరుందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీలాంటి చోటుకు భారత్‌నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నైపుణ్యం, వనరులున్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతంమేర జీసీసీలు భారత్‌కు వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిదిశగా భారత్ దూసుకెళ్తోందన్నారు. భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్‌ను భారత్ ఎగుమతి చేస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అప్పుడు కుటుంబ నియంత్రణ- ఇప్పుడు జనాభా నిర్వహణ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధులసంఖ్య వేగంగా పెరుగుతోందని.. ఆ ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడుతున్నామని సీఎం వివరించారు. భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 1.5 ఫెర్టిలిటీ రేటును 2.1గా తీసుకెళ్లేందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకువచ్చామని సీఎం వెల్లడించారు. ప్రజాప్రతినిధిగా 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసి.. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నామని అన్నారు. ఇద్దరు అంతకంటే ఎక్కువమంది పిల్లలుండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇద్దరుకంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయం, నెల వారీగా రూ.వెయ్యి అందించాలని నిర్ణయించామని చెప్పారు. చైల్డ్ కేర్ లీవ్‌లాంటి ప్రోత్సాహకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించే సామర్ధ్యం భారత్‌కు మాత్రమే ఉందన్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఇప్పుడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో ఉన్న పెద్ద కుటుంబాలు దేశానికి పెద్ద ఆస్తి అని.. ప్రస్తుతం అవి మైక్రో ఫ్యామిలీలుగా మారాయన్నారు. ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.
అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్
విభిన్నంగా ఆలోచన చేసే వారికోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని.. డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కూడా నిర్మిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో ఆరోగ్యరంగంలో పెనుమార్పులు రానున్నాయని.. గతంలో ఊహగానే ఉన్న డ్రోన్ అంబులెన్సులు కూడా రియాలిటీలోకి వచ్చేశాయన్నారు. ఏఐ డేటా సెంటర్లతో ఏపీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ డెస్టినేషన్‌గా ఏపీ తయారవుతుందన్నారు. మెరుగైన సదుపాయాలతో వ్యాపార అనుకూల ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దామని.. పెట్టుబడులతో వస్తే జాప్యం లేకుండా అనుమతులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. కార్యక్రమానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సహా 110 దేశాలనుంచి 2700 మందికిపైగా ప్రతినిధులు, మేధావులు, నిఫుణులు, వ్యూహకర్తలు హాజరయ్యారు. 2016నుంచి జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ సదస్సుకు తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్వాహకులు ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానంమేరకు సీఎం చంద్రబాబు ఈ రైసినా డైలాగ్‌కు హాజరై తన అభిప్రాయాలను వివరించారు.












