- నేటి అధికారం వెనుక కార్యకర్తల కష్టం ఉంది
- కరడుగట్టిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి
- చట్టబద్ధమైన పనుల కోసం కేడర్ వెళితే అధికారులు స్పందించాలి
- శ్రీవారి హుండీలో రూ.50కోట్లు కొట్టేస్తే సైకో దృష్టిలో చిన్న దొంగతనమా?
- పాలకొండ టీడీపీ కార్యకర్తల సమావేశంలో యువనేతలోకేష్
పాలకొండ (చైతన్యరథం): వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్ఘాటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామినిలో కార్యకర్తల సమావేశంలో గురువారం యువనేత లోకేష్ పాల్గొన్నారు. తొలుత పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యువనేత లోకేష్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు, తాను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలను కలిశాకే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నామన్నారు. అధికారంలోకి రావడానికి దశాబ్దాలుగా ఎత్తిన పసుపుజెండా దించకుండా కష్టపడిన ప్రతి కార్యకర్త శ్రమ దాగిఉంది. 2019-24 నడుమ సైకో పాలన చూశాం, బయటకు రావాలంటే గేట్లకు తాళ్లుకట్టారు, నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టారు. యువగళం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకునేందుకు జీఓ 1 తెచ్చారు. అయినా తాను తగ్గలేదని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి
ప్రతిపక్షంలో ఉండగా స్థానిక ఎన్నికల్లో అంజిరెడ్డితాత నామినేషన్ పత్రాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తే తొడగొట్టి మరీ నామినేషన్ వేశారు. పల్నాడులో మంజులపై ప్రత్యర్థులు దాడి చేసినా పోలింగ్ బూత్ వద్ద వైసీపీ రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి. పల్నాడులో తోట చంద్రయ్య అనే కార్యకర్తను మెడపై కత్తిపెట్టి వారి నాయకుడికి జై కొట్టమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 94శాతం సీట్లు సాధించడం వెనుక మీ అందరి కష్టం, చెమట దాగి ఉన్నాయి. వేదికపై ఉన్న నాయకులందరం అదృష్టవంతులం. అయిదేళ్లు మీరు మా వెంట నిలిచారు. నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలే అండగా నిలిచారు. మన అధినేత చంద్రబాబుని 53 రోజుల్లో అక్రమంగా జైల్లో పెడితే అండగా నిలబడి బయటకొచ్చి పోరాడిరది కార్యకర్తలే. అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది. ఇంత అద్భుతమైన కార్యకర్తలు టీడీపీకి మాత్రమే సొంతం. ఒక్క పిలుపు ఇస్తే సైన్యంలా తరలివచ్చే కేడర్ మనకే సొంతమని లోకేష్ అన్నారు.
ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏపీకి బ్యాక్ బోన్
ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. మొదటి హామీ నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు. అధికారంలోకి వచ్చి 18నెలల్లోనే ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్ పోర్టు, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్.. వంటి ఎన్నో భారీ ప్రాజెక్టులు తెచ్చాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర బ్యాక్‌వర్డ్ ప్రాంతం కాదు, ఏపీకి బ్యాక్ బోన్. ఎన్ని ఇబ్బందులున్నా మాట నిలుపుకుంటున్నాం. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, మహిళలకు ఉచిత బస్సు కల్పించిన ఘనత కూటమిదే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చి మాట నిలుపుకున్నాం. రైతులకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ నిధులు అందిస్తున్నామని లోకేష్ చెప్పారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
గతంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4వేల సామాజిక పెన్షన్ ఇస్తున్నాం. ఇంత పెద్దమొత్తంలో పెన్షన్‌ను ధనిక రాష్టాలు కూడా ఇవ్వడం లేదు. వికలాంగులకు రూ. 6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు ఇస్తున్నాం. అధికారంలో వచ్చిన తొలి ఏడాదే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పి 150 రోజుల్లో పూర్తిచేశాం. వైసీపీ నాయకులు 150 కేసులు వేసినా అనుకున్నది చేసి చూపించాం. ప్రజాదర్బార్ ద్వారా కార్యకర్తలు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. 2004 తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ గెలవలేదు. మనపై బాధ్యత పెరిగింది. ఆశతో ప్రజలు మనవైపు చూస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టామని లోకేష్ తెలిపారు.
ప్రజలు శాంతియుత పాలన కోరుతున్నారు
గతం ప్రభుత్వంలో మాదిరి అరాచకాలు కూటమి పాలనలో ఉండకూడదన్నది ప్రజల ఆకాంక్ష. ప్రజలు శాంతియుత పాలన కోరుకుంటున్నారు. సైకో పాలనలో మన కార్యకర్తలను వెంటాడారు, కేసులు పెట్టారు. ప్రజలను కూడా వదల్లేదు. దళిత డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడని ముద్ర వేసి చంపారు, రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే బీసీ తమ్ముడిని చితకబాది కాగితాలు నోట్లో కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారు. నేడు గిరిజన సోదరుల కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించాం. అయితే చేయాల్సింది చాలా ఉంది. పట్టుదల, సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు కృషిచేస్తున్నామని లోకేష్ అన్నారు.
చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి
సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా పరుగెడుతున్నారు. ప్రజాసేవలో ఆయన నిబద్ధత వేరు. పార్టీపట్ల, కార్యకర్తకర్తలపై ఆయనకున్న ప్రేమను అందరూ గమనించాలి. తరతరాలుగా కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఆనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నాం. వివిధ కారణాల వల్ల మూతపడే పరిస్థితి వస్తే కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.14వేల కోట్లు ఇచ్చి కాపాడుకున్నాం. అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించలేని విశాఖ రైల్వేజోన్‌ను మొదటి సంవత్సరమే సాధించాం. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు 18 నెలల్లో చేశాం. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని లోకేష్ ఉద్బోధించారు.
అలిగి ఇంట్లో పడుకోవద్దు
అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. పార్టీలో సంస్కరణల కోసం జగన్‌తో కంటే మూడు, నాలుగురెట్లు పోరాడాను. అధినేత చంద్రబాబుని ఒప్పించడం అంత తేలిక కాదు. అనుకున్నది సాధించేవరకు నేను వదలిపెట్టను. ఇది మన పార్టీ. మనం మాట్లాడుకుని చర్చించి సాధించుకోవాలి. గ్రామ, మండల, నియోజకవర్గం, పార్లమెంటు, జోనల్ స్థాయిలో సమస్యలు పరిష్కరించుకోవాలి. మన పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. కలసికట్టుగా అందరం ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్‌ట్రైన్ సర్కారు వల్లే రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకుంటున్నాం. పవనన్న చెప్పినట్లుగా రాబోయే 15ఏళ్లు మనం కలసి ఉండాలి. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు.
రూ.50 కోట్లు చిన్నదొంగతనమా?
జగన్ విలేకరులతో మాట్లాడుతూ… పరకామణిలో ఒకడు రూ.50 కోట్లు డబ్బు దొంగిలిస్తే, అది చిన్నది అంటున్నాడు. అది చిన్న దొంగతనమా? జగన్ కు చెబుతున్నా… దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు. జగన్.. దేవుడిని పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు. గుంటూరు జిల్లాలో పరామర్శకు వెళ్లి మరో ఇద్దరిని చంపారు. కార్యకర్త మెడపై నుంచి కారు వెళ్లినా ఆగకుండా వెళ్లాడు. అదీ ఆయన నైజం. వైసీపీలో కార్యకర్తలంటే గౌరవం ఉండదు. తల్లి, చెల్లిని మెడబట్టి బయటకు నెట్టిన సైకో పార్టీ మనది కాదు. అందరినీ గౌరవించే పార్టీ మనది. ఈ మధ్య రప్పారప్పా అంటున్నారు. అందుకే మనం కుర్చీ మడతపెట్టాం. అధికారంలో ఉన్నపుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడు భయపడతామా అని లోకేష్ అన్నారు.
కార్యకర్తలను గౌరవించి తీరాల్సిందే
టీడీపీ కార్యకర్తలు ఆఫీసులకు వెళితే గౌరవంగా చూడాల్సిందే. ప్రతి పనికి లోకేష్, ఎమ్మెల్యే ఫోన్ చేయాలంటే కుదరదు. చట్టప్రకారం చేయాల్సిన పనులు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలివ్వాలి. గ్రూపు రాజకీయాలు ఉండకూడదు, అటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. అందరం కలసి పార్టీని నిలబెట్టుకోవాలి. ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలి. మనందరి నాయకుడు చంద్రబాబు ఒక్కరే. చంద్రబాబు మన సేనాధిపతి, అందరం సైనికులం. ఆయన ఆదేశిస్తే ఎంతదూరమైనా పరిగెడతాం. అబ్జర్వర్, జోనల్ కోఆర్డినేటర్ అందుబాటులో ఉంటారు. పనిచేసిన నాయకులను ఎలా ప్రోత్సహించాలో పార్టీకి వదిలేయండి. కలసికట్టుగా పనిచేద్దాం, ముందుకెళదాం. మై టీడీపీ యాప్ ద్వారా కేడర్‌కు బాధ్యతలు ఇస్తాం, మీరు సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. పార్టీ కేడర్‌ను గుర్తించేందుకు టెక్నాలజీతో అనుసంధానిస్తున్నాం. మనది నాయకులపై నడిచే పార్టీ కాదు, కార్యకర్తలపైన, వ్యవస్థపైన నడిచే పార్టీ. ఇందులో అందరూ అనుసంధానం కావాలి. పార్టీ కార్యకర్తలను నాయకులు గౌరవించాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాది. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కలసికట్టుగా పనిచేద్దాం, చిత్తశుద్ధి, పట్టుదలతో ముందుకు సాగుదామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.
పార్టీ బాగుంటేనే కార్యకర్తలు బాగుంటారు
ఉత్తరాంధ్ర టీడీపీ సమన్వయకర్త దామచర్ల సత్య మాట్లాడుతూ… కార్యకర్తల కష్టాన్ని గుర్తించే పార్టీ తెలుగుదేశం అన్నారు. పార్టీ బాగుంటే కార్యకర్తలు బాగుంటారు, కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది. కోటిమంది సభ్యులను చేర్చిన సత్తాగల నాయకుడు లోకేష్ అన్నారు. అరకు పార్లమెంటు అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 3,132 కి.మీ. పాదయాత్ర చేసిన యోధుడు నారా లోకేష్ అన్నారు. కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకొని అండగా నిలుస్తున్నారు. కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారన్నారు. పాలకొండ ఇన్‌ఛార్జి పడాల భూదేవి మాట్లాడుతూ… కార్యకర్తల మనసులో మాట వినడానికే లోకేష్ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2029లో కూటమి ప్రభుత్వం మళ్లీ రావడానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.












