- అక్రమాలపై చర్యలు తీసుకుంటే అధికారుల్ని బెదిరిస్తావా?
- కులాలు, మతాల పేరుతో కుట్రలు చేస్తే సహించేది లేదు
- పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
మచిలీపట్నం (చైతన్య రథం): మచిలీపట్నంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగిస్తే పేర్ని నాని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నాడో సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. “అక్రమ కట్టడాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు వ్యవహరించిన వైఖరి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నిర్మాణాలు చేపట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల ముందు, పెద్దల సమక్షంలో కట్టడాలు చేయమని హామీ ఇచ్చి, రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులు చూస్తూ ఊరుకుంటారా? నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్న కమిషనర్, ఎస్పీ, సీఐవంటి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అధికారులు తమ విధులు నిర్వహిస్తుంటే నీకెందుకు అంత నొప్పి” అని నిలదీశారు.
“వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలపూడి ప్రాంతంలో పేదల ఇళ్లు కూల్చివేసిన ఘటనలో కూడా నాని పాత్ర ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 130 అడుగుల రోడ్డు పేరుతో యాదవ సోదరుల ఇళ్లను కూల్చివేయాలని ప్రయత్నించిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని హెచ్చరించారు. గాంధీ బట్టల దుకాణం విషయంలో జరిగిన ఘటనలో ఆయన మానసికంగా ఇబ్బంది పడటానికి కారణం పేర్ని నాని కాదా? పేర్ని నానిలాంటి వ్యక్తిని కన్నందుకు వారి తల్లిదండ్రుల ఆత్మ క్షోభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రికి ఒక్కరోజైనా అన్నం పెట్టావా? అని మంత్రి నిలదీశారు.
గత 5 సంవత్సరాలుగా రామ్ నితీష్ మాల్ నిర్మాణాన్ని అడ్డుకున్న విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బైపాస్ రోడ్ విషయంలోనూ అనేక వివాదాలు తలెత్తాయి. ఎన్ని పాపాలు చేశావు నాని… నువ్వు అసలు మనిషివేనా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వానికి కులాల మతాలు లేవు. ప్రజల కోసమే పని చేస్తున్నామని మంత్రి కొల్లు స్పష్టం చేశారు. మీ మున్సిపల్ పదవీకాలం ముగిసిన తర్వాతే భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనం నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. వంగవీటి రంగా హత్యలో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటికి పిలిచి విందులు పెట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మేము ఎప్పుడూ ధర్మం పక్షాన నిలబడతాము. ఇప్పటికే 2600 జిం3 ఇళ్లు నిర్మించి అర్హులైన వారికి అందించామని తెలిపారు. ఇళ్ల పంపిణీ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నాం.. డ్రైనేజీ వ్యవస్థను ఫేజ్ వైజ్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పేర్ని నాని అర్ధరాత్రి సమయంలో దొంగ పట్టాలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారులను బలిచేసింది పేర్ని నాని అని విమర్శించారు. ధర్మం ప్రకారం ముందుకు సాగుతామని, ఎవరైనా నష్టపోతే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులను వారి విధులు నిర్వహించుకోవాలని, బాధ్యత గల రాజకీయ నాయకుడిలా ప్రవర్తించాలని హెచ్చరిస్తూ, ఇకపై అధికారులు కాలర్ ఎత్తుకుని పనిచేసేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.













