- ప్రజలు మెచ్చే పాలనివ్వాలి బిజినెస్ రూల్స్ మార్చుకుందాం
- మాట ఇచ్చాం… విద్యుత్ ఛార్జీలు పెంచం
- వినూత్న ఆలోచనలతో ప్రజలకు సేవలు… అభివృద్ధి పనులు
- చాలా శాఖలు గాడిన పడ్డాయి… ఇంకొన్ని గేరప్ కావాలి
- రాష్ట్రానికున్న అప్పులన్నింటినీ రీ-షెడ్యూల్ చేస్తున్నాం
- ఏపీ బ్రాండ్ తిరిగి తెచ్చాం… పెట్టుబడులు వచ్చాయి
- మంత్రులు, కార్యదర్శులు, హెచ్వోడీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రజలు మెచ్చే పాలన అందించే దిశగా ప్రతి విభాగం, ప్రతి అధికారి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీల కాన్ఫరెన్సు జరిగింది. సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరయ్యారు. వృద్ధిరేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు. అలాగే మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై సూచనలు చేశారు. దీంతోపాటు సూపర్ సిక్స్ పథకాల, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్సు, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజలనుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారంపై హెచ్‌ఓడీలకు సీఎం సూచనలు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలపై సమావేశంలో చర్చించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ‘18 నెలల పాలను సమీక్షించుకుని, ఆర్ధిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చించకుని, ఆ దిశగా అందరూ పని చేయాలి.
ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది. ప్రజలు మెచ్చే పాలన అందించాలి. ఫైళ్లు పెండిరగులో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారంతో డేటా లేక్ వ్యవస్థ సిద్ధమైంది. ఈ సమాచారంతో ఇకపై డేటా డ్రివెన్ గవర్నెన్స్ దిశగా అందరూ పనిచేయాలి. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ అడుగులు వేస్తోంది. అందుకే పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి. విశాఖలో 1 గిగా వాట్ సామర్ధ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ప్రధానిని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కలిశారు. రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమని చెప్పారు. సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చు. ప్రజల అవసరాల కోసం రాజ్యాంగాన్నే చాలాసార్లు సవరణలు చేశారు. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే పరిస్థితి ఉండకూడదు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరే పరిస్థితి రావాలి. గత పాలకులు పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకాలను అస్తవ్యస్తం చేశారు. గత ప్రభుత్వం అవలంభించిన విధానాలతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా నిబంధనలే మార్చేసింది. ఆగిపోయిన కేంద్ర పథకాలను తిరిగి పునరుద్ధరించాం. వీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. గత పాలకుల నిర్వాకం వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతింది. దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది. ఆదాయం తగ్గింది. క్రెడిట్ రేటింగ్ తగ్గిపోవటం వల్ల వడ్డీల భారం పెరిగింది. ఇప్పుడున్న అప్పును, వడ్డీలను రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలు ఆడిట్ పరిధిలోకి రావాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి సుపరిపాలన, అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణ హామీ ఇచ్చాం. ఆ దిశగా పాలన సాగేలా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ పని చేయాలి’’ అని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గిస్తాం
‘స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లను రేషనలైజ్ చేసి గ్రామ, పట్టణ ప్రాంతాల్లో అవసరమైనట్టుగా విధులు చేపట్టేలా మార్చుకుందాం. ప్రతీ ప్రభుత్వ శాఖ ఓ మంచి ఫలితాల కోసమే పనిచేస్తోంది. ఆ ప్రయోజనాలు ప్రజలకు తెలియాలి. విద్య, విద్యుత్, నీటి భద్రత, వ్యవసాయం, వైద్యం సహా వివిధ శాఖల్లో సంస్కరణలు అమలు చేస్తున్నాం. ప్రజలపై భారం పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే… సంస్కరణల ద్వారా ప్రజలకు మేలు జరిగేలా చూస్తున్నాం. పీపీపీఎలను రద్దు చేసి గత ప్రభుత్వం రూ.9 వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని రూ.4.92కు తగ్గించాం. మొత్తంగా రూ.9 వేల కోట్లమేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. కానీ దీనివల్ల ప్రజలపై భారం పడుతుంది. అందువల్ల ఈఆర్సీ సూచనల అమల ఆలోచన చేయడం లేదు. ప్రజలపై భారం వేయకూడదని నిర్ణయించాం.
విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఐదేళ్లల్లో విద్యుత్ కొనుగోలు ధరను రూ.4కు తగ్గించేలా కృషి చేస్తున్నాం. అందరం కలిసి సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం. ఒక్క పెన్షన్లలోనే ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లకు పైగా పేదలకు పంపిణీ చేశాం. ఏపీ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రాండ్. గత పాలకులవల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ బ్రాండ్ తిరిగి తీసుకురాగలిగాం. విశాఖ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మన యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయి. ఎప్పటికప్పుడు ఎస్‌ఐపీబీలు పెట్టుకుని పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నాం. మొదటి త్రైమాసికంలో 12.02 శాతం గ్రోత్ రేట్ వచ్చింది. రెండో త్రైమాసికంలో 11.28 శాతం వృద్ధి నమోదైంది. 8.7 శాతం జాతీయ సగటుకంటే ఎక్కువ ప్రగతి సాధించగలిగాం. ఇక భవిష్యత్ కాలానికి 17.11 శాతం లక్ష్యంగా పెట్టుకున్నాం. నీటి భద్రత విషయంలో ముందు చూపుతో పని చేశాం. సాగు నీటి ప్రాజెక్టుల్లో 944 టీఎంసీ నిల్వ చేసుకున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
అధికారుల ఆలోచనా విధానం మారాలి
‘‘ఉన్నతాధికారులంతా శాస్త్రీయంగా ఆలోచన చేసి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. నిధుల లభ్యత తక్కువగా ఉన్నా… అభివృద్ధి పనులు ఆగకుండా చూడాలి. ఈ విధంగా చేయాలంటే అధికారులు వినూత్నంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని జోన్లుగా, రీజియన్లుగా, కారిడార్లుగా, క్లస్టర్లుగా హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అన్ని శాఖలు, అన్ని ప్రభుత్వ సేవల్లో ప్రజల్లో సంతృప్తస్థాయిని నమోదు చేస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలతో చక్కగా వ్యవహరించాలి. టీటీడీ పనితీరు మెరుగవుతోంది. కానీ దేవదాయ శాఖ పని తీరు మెరుగు పడడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. జనవరి 15నాటికి అన్ని సేవలూ ఆన్ లైన్లో సేవలందించే పరిస్థితి రావాలి’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.















