- సంతానోత్పత్తి రేటు తగ్గుదలను పరిష్కరించాలి
- కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
- జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి అంశంపై ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రెజెంటేషన్
అమరావతి (చైతన్యరథం): జనాభా నిర్వహణకు మించిన ప్రజారోగ్య సవాళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార కల్తీ నేడు అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుదలను పరిష్కరించడంతో పాటు మొత్తం ఆరోగ్య సంరక్షణ విధానాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సు రెండొరోజు గురువారం జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ది అంశంపై రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ జనాభా నిర్వహణకు మించిన ప్రజారోగ్య సవాళ్లపై దృష్టి సారించాలన్నారు. ఫ్యాటీ లివర్ అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారిందన్నారు. పౌల్ట్రీలో వ్యాక్సిన్లు, గ్రోత్ ప్రమోటర్ల వాడకం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. మొత్తం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్షులకు ఇచ్చే గ్రోత్ ప్రమోటర్లను తగ్గించడంపై పశుసంవర్ధక శాఖతో కలిసి పనిచేయాలని ఆదేశించారు, కల్తీ లేని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం అవసరాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అంతకు ముందు సదస్సులో స్వర్ణాంధ్ర 2047`పది సూత్రాల్లో ఒకటైన జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి అంశంపై సౌరభ్ గౌర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జనాభా నియంత్రణ నుంచి జనాభా స్థిరత్వం వైపు గణనీయమైన విధాన మార్పును ఈ ప్రజెంటేషన్ సూచించింది. దేశం కంటే వేగంగా ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల జనాభా పెరుగుతోందన్నారు ఆంధ్రప్రదేశ్‌లో సగటు వయస్సు 32.5 సంవత్సరాలు ఉంటే జాతీయ సగటు 28.4 సంవత్సరాలుగా ఉంది. రాష్ట్ర మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 1.5కి తగ్గింది. జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల దారిలోనే ఆంధ్రప్రదేశ్ సాగుతోంది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఒకప్పుడు చాంపియన్‌గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుత జనాభా సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన విధాన ప్రాధాన్యతల్లో మార్పు గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ‘పెరుగుతున్న పని చేయని వయస్సు జనాభా’ సమస్యనే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. టీఎఫ్‌ఆర్ తగ్గుదలను అడ్డుకుని, భవిష్యత్ జనాభా పతనాన్ని నివారించడానికి ఫ్రాన్స్, హంగేరీల్లో అమలు చేసిన విధానాల మాదిరిగా ‘‘రెండవ బిడ్డ తర్వాత’’ ప్రోత్సాహక సూత్రాన్ని సూచించారు.
రిప్రొడక్టివ్ మెడిసిన్‌లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఫెర్టిలిటీ కాలేజీల స్థాపన ప్రణాళికల గురించి వివరించారు. ప్రభుత్వ రంగంలో తొలిసారిగా అమలయ్యే ఈ కార్యక్రమం నిపుణులకు అత్యాధునిక శిక్షణ ఇస్తుంది. ఫెర్టిలిటీ సవాళ్లను ఎదుర్కొంటున్న దంపతులకు రాష్ట్ర మద్దతుతో ఐవీఎఫ్ చికిత్స అందిస్తుంది, స్థిరమైన జనాభా పెరుగుదలకు కీలకమైన అడ్డంకిని పరిష్కరిస్తుంది. జనాభా నిర్వహణకు ఐదు వ్యూహాత్మక అంశాలతో కూడిన సమగ్ర విధానాన్ని సౌరభ్ గౌర్ వివరించారు. సపోర్టివ్ ఫెర్టిలిటీ ఎకో సిస్టమ్.. సంచార చికిత్స విధానం ద్వారా వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణ.. 6వ తరగతి నుంచి ప్రారంభమయ్యే స్కిల్ పాస్‌పోర్ట్ సిస్టమ్ ద్వారా జీవితకాల నైపుణ్యాలు పెంపొందించడం.. సురక్షిత రవాణా, తప్పనిసరి క్రెచ్‌ల ద్వారా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.. మండల స్థాయిలో ఎల్డర్లీ క్లబ్‌ల ఏర్పాటు.. అంశాల గురించి తెలిపారు.
ప్రస్తుతం 31శాతం ఉన్న మహిళా శ్రామిక శక్తిని పురుషులతో సమానంగా 59 శాతానికి చేర్చాల్సిన అవసరాన్ని వివరించారు. దీనివల్ల రాష్ట్ర జీఎస్‌డీపీ 15% పెరుగుతుందన్నారు. ప్రసవ సమయంలో మహిళల మరణాల రేటును ప్రస్తుత 30 నుంచి ప్రపంచ ఉత్తమ ప్రమాణాలకు (5 కంటే తక్కువ, నార్వే, పోలాండ్, బెలారస్‌తో సమానం) తగ్గించడం, శిశు మరణాల రేటును 17 నుంచి 2 కంటే తక్కువకు (సింగపూర్, ఐస్‌లాండ్‌తో సమానం) తగ్గించడం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాల గురించి వివరించారు. జిల్లా స్కిల్ హబ్‌లు, డిజిటల్ లైబ్రరీలు, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో ప్రత్యేక విభాగాలతో వృద్ధుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, దివ్యాంగుల కోసం పునరావాస కేంద్రాలు, ఆత్మహత్య నివారణ ఫ్రేమ్‌వర్క్‌తో సహా అనేక సంస్థాగత కార్యక్రమాలను ప్రకటించారు. సమగ్ర పొగాకు నియంత్రణ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
జనాభా స్థిరత్వం కోసం అమలు చేయాల్సిన నిర్దిష్ట చర్యలకు సంబంధించిన ప్రణాళికలపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మండల స్థాయిలో మాతా,శిశు మరణాలు, టీఎఫ్‌ఆర్‌పై కలెక్టర్లు నెలవారీ సమీక్షలు నిర్వహించాలి, అధిక డ్రాపౌట్ రేట్లు, తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఉన్న ‘‘జనాభా హాట్‌స్పాట్‌లు’’ గుర్తించాలి. సంజీవని ప్లాట్‌ఫారమ్ కింద 100% లెక్కింపు, ట్రాకింగ్‌ను నిర్ధారించాలి. స్కిల్ పాస్‌పోర్ట్ డేటా ద్వారా యువత ప్లేస్‌మెంట్‌ను పర్యవేక్షించాలి. గర్భిణులు, పిల్లల కోసం పోషకాహార సప్లిమెంట్లు, ప్రసూతి-శిశు హక్కుల 100% సంతృప్తిని నిర్ధారించాలని కలెక్టర్లకు సౌరభ్ గౌర్ సూచించారు.











