- 23 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ లక్ష్యం
- మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్
- నేటినుంచే రబీ ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నామని వెల్లడి
నిడదవోలు (చైతన్య రథం): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సంయుక్తంగా ప్రకటించారు. శుక్రవారం నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌ను కూటమి ప్రభుత్వం అత్యంత విజయవంతంగా ముగించిందని మంత్రులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావంటి ప్రాంతాల్లో సాగు ఆలస్యమైనప్పటికీ, అక్కడ రికార్డుస్థాయిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబోతున్నామని వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో రబీ సీజన్లోనూ అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుండే ధాన్యం సేకరణ ప్రారంభించబోతున్నామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పనిచేస్తున్నామన్నారు.
రైతు పక్షపాతి ప్రభుత్వం – గత గణాంకాలతో పోలిక
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022-23లో 14.12 లక్షలు, 2023-24లో కేవలం 12.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని.. కానీ కూటమి ప్రభుత్వం గత రబీలో 22 లక్షల లక్ష్యానికి గానూ 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. 2.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,575 కోట్లు కేవలం 48 గంటల్లోనే జమ చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఖరీఫ్ సీజన్ లో కూటమి ప్రభుత్వం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టి రూ.11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేవలం 24 గంటల్లోనే జమ చేశామని గుర్తుచేశారు.అందులో సుమారు రూ.7300 కోట్ల రూపాయలు కేవలం 8 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులు హర్షించడం తమకు సంతోషం కలిగించిందన్నారు.
రబీ సేకరణకు పక్కా ప్రణాళిక:
ఈ రబీలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,917 సేకరణ కేంద్రాలు ఈ వారంలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రైతుల కోసం 5.40 కోట్ల గన్ని బ్యాగులు, రవాణాకు 17,262 వాహనాలను సిద్ధం చేశామని ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కల్లాల వద్దే, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోదాలు అందిస్తామన్నారు.24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2,411 రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాయని వివరించారు.













