- 108 సిబ్బంది సాహసోపేతం
- అడ్డంకులను అధిగమించి
- యువకుడిని కాపాడిన వైనం
అమరావతి/అడ్డతీగల(చైతన్యరథం): అటవీ ప్రాంతం.. రహదా రి లేదు..అడ్డంగా ప్రవహిస్తున్న వాగులు..ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో వాటిని అధిగమించి 108 సిబ్బంది ఒక యువకుడి ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. వై.రామవరం మండలం పి.యర్రగొండ పంచాయతీలోని తడికోట గ్రామానికి చెందిన చోళ్ళ చిన్నరెడ్డి (20) అనే యువకుడు ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందిన వెంటనే అడ్డతీ గల ప్రాంతానికి చెందిన 108 వాహనం సంఘటన స్థలానికి బయలుదేరింది. బాధితుడు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు. మార్గ మధ్యలో ఏడు వాగులు అడ్డంగా ఉన్నప్పటికీ పైలట్ నవాజ్, ఈఎంటీ వెంకట్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కాలినడకన అటవీ మార్గంలో ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు. వాహ నం లోపలికి వచ్చే అవకాశం లేకపోవడంతో బాధితుడిని ఒక డోలీలో ఉంచి సుమారు 5 కిలో మీటర్ల దూరం భుజాలపై మోసు కుంటూ ప్రధాన రహదారిపై ఉన్న 108 వాహనం వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి క్షతగాత్రుడిని అత్యంత వేగంగా అడ్డతీగల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాని¿ తరలించి వైద్యులకు అప్పగించారు. సకాలంలో వైద్యం అందేలా చూడటం లో 108 సిబ్బంది ప్రదర్శించిన సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే పరమావధిగా భవ్య హెల్త్ సర్వీసెస్ (108) పనిచేస్తోంది. “ఆపదలో మేమున్నాం” అనే భరోసాతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం అత్యుత్తమ సేవలు అందించడమే మా సంకల్పమని తెలిపారు.

















