- ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది… నిర్దేశిస్తుంది
- పీపీపీ పద్ధతిలో రోడ్లువేస్తే.. ప్రైవేట్ రోడ్లవుతాయా?
- విమర్శలకు భయపడం.. ప్రజలకు వాస్తవాలు చెబుతాం
- 5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు స్పష్టత
అమరావతి (చైతన్య రథం): పీపీపీ విధానంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా… అవి ప్రభుత్వ కాలేజీల పేరిటే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ‘‘పీపీపీ విధానంలో మెరుగైన సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70 శాతంమందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో సీట్లు అందుతాయి. సీట్లు కూడా పెరుగుతాయి. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బుంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అవి ప్రైవేటు వ్యక్తులవి అయిపోతాయా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.














