- ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరుకానున్న చంద్రబాబు
- పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
అమరావతి, ఫిబ్రవరి 19: అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హాజరవుతున్నారు. ఏపీని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి.. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. శుక్రవారం ఉదయం జైపూర్‌నుంచి ఢిల్లీకి చేరుకుంటున్న సీఎం.. భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ వేదికకు వెళ్తారు. 9.30 గంటలకు ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొనున్నారు.
అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షలమంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. క్వాంటంతోపాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసీసీ సంస్థతోనూ ఒప్పందం జరుగనుంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎనఐఈఎలఐటీతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటీ మద్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు.
అనంతరం క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. మద్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గొంటారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ, ఆన్‌లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క నారాయణ్, భారత్‌లో యూకే హై కమిషనర్ లిండి కెమరాన్, వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సెలర్ శాలీ టేలర్ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలేతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా సమావేశమవుతారు. అనంతరం ఢిల్లీనుంచి బయల్దేరి రాష్ట్రానికి చేరుకుంటారు.
జైపూర్‌కు సీఎం
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ వివాహానికి హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు జైపూర్‌కు బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడనుంచి జైపూర్‌కు బయలుదేరిన సీఎం.. జైపూర్‌లోని బృందావన్ ప్యాలెస్‌లో జరిగే వివాహానికి హాజరై రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం జైపూర్‌నుంచి బయల్దేరి ఢిల్లీలో జరిగే ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు.















