సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారంవద్ద వారికి ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించింది. దేవాంశ్ పేరుతో ఒక్క రోజు అన్నదాన వితరణకు రూ. 44 లక్షల విరాళం అందించారు. వెంగమాంబ సత్రంనుంచి పద్మావతి వసతిగృహానికి వెళ్తూ సీఎం మధ్యలో ఆగారు. లేపాక్షి కూడలిలో భక్తులతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. భక్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అనంతరం తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తితిదే ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ముందస్తుగా గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన సమయంనుంచి.. శ్రీవారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు.. వారికి అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలన్నారు.
















