అమరావతి (చైతన్య రథం): సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. “శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవతోపాటు, శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారు. ‘చదువుతోనే సాధికారత’ అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆరోజుల్లోనే చాటి చెప్పారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, తన వారందరికీ ధైర్యాన్నిచ్చిన ధీశాలి దొమ్మేటి వెంకటరెడ్డి. ఈ జయంతి వేడుకలవేళ ఆయనను స్మరించుకుని, స్ఫూర్తి పొందుదాం” అని ఎక్స్ వేదికపై పోస్టు పెట్టారు.

















