- రెండు మండలాలతో రెవిన్యూ డివిజన్.. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు
- ఫలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి
- వైసీపీ విష ప్రచారానికి తెర
అమరావతి (చైతన్యరథం): రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ తరలిపోతుందనే వైసీపీ చేసిన విష ప్రచారానికి తెర పడిరది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన కృషి ఫలించింది. రామచంద్రపురం, కె గంగవరం మండలాలతో పాటు రామచంద్రపురం మున్సిపాలిటీతో కలిపి రామచంద్రపురం రెవిన్యూ డివిజన్‌ను కొనసాగించేందుకు సోమవారం అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. దీంతో ఇన్నాళ్లుగా ప్రజలను తప్పుదారి పట్టిస్తూ వైసీపీ చేస్తున్న మోసపూరిత ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది. గత కొంతకాలంగా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ఎత్తివేస్తున్నారంటూ నానా హంగామా చేస్తూ ప్రజలను వెసీపీ నాయకులు తప్పుదారి పట్టించిన సంగతి విదితమే. తాజాగా క్యాబినెట్ ఆమోదంతో రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ ప్రజలకు ఊరట లభించింది. రెండు మండలాలు, రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంతో యధావిధిగా రెవెన్యూ డివిజన్ కార్యాలయం (ఆర్డీవో), సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం (డీఎస్పీ ) కొనసాగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు. రెండు మండలాలతో పరిపాలన సౌలభ్యం కూడా మెరుగుపడుతుందని, ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ కేవలం రెండు మండలాలతో కొనసాగడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ ప్రజలకు ఇది పెద్ద శుభవార్త అని పేర్కొన్నారు.















