తిరుపతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబం తిరుపతి చేరుకుంది. రెండు రోజుల పర్యటన, నేడు నారా దేవాన్షి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకునే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కుటుంబం తిరుపతికి చేరుకుంది. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. వ్యక్తిగత పాలనా బాధ్యతలు ముగించుకుని ఇంచుమించు అదే సమయంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు తిరుపతికి చేరుకున్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈఓ ఎం రవిచంద్ర, ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ డి ప్రసాదరావు తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సీఎం చంద్రబాబు, లోకేష్లకు స్వాగతం పలికారు. రాత్రికి తిరుమల లోనే బస చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. మనుమడు నారా దేవాన్షీ పుట్టిన రోజును పురస్కరించుకుని నేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు.
ఉదయం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కాంప్లెక్సులో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయనున్నారు. ఒక్కరోజు అన్న ప్రసాద వితరణకు అయ్యే మొత్తం రూ.44 లక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం విరాళంగా ఇవ్వనుంది. ఇప్పటికి 12సార్లు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుకు విరాళాన్ని సీఎం చంద్రబాబు అందించడం విశేషం. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్సులో సీఎం చంద్రబాబు కుటుంబం స్వయంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డించను న్నారు. అనంతరం భక్తులతో ముఖ్య మంత్రి చంద్రబాబు ముచ్చటిస్తారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆహార పదార్ధాల విశ్లేషణ ల్యాబొరేటరీని చంద్రబాబు ప్రారంభిస్తారు.















