హైదరాబాద్ (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల గెలుపు కోసం తాను మొక్కిన మొక్కు భువనమ్మ పిలుపుతో పరిపూర్ణమైందని సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు అన్నారు. నారా భువనేశ్వరి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా ఆమెను కలిసిన నారాయణ రావు.. ఆమె చూపినవాత్యల్యానికి ధన్యుడినయ్యాయని అన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గడచిన ఎన్నికలల్లో మంగళగిరి నియోజకవర్గంనుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుకుంటూ.. తన కోరిక ఫలిస్తే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో స్వామివారికి శాశ్వత రథం సమర్పిస్తానని నారాయణ రావు మొక్కుకున్నారు. తన ఆకాంక్ష నెరవేరడమే కాదు, రాష్ట్రంలోనే గొప్ప మెజారిటీతో లోకేష్ ఘనవిజయం సాధించడం జరిగిందని వివరించారు. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా.. గత జనవరి 24న స్వామికి కోటి రూపాయలతో విలువైన శాశ్వత రథాన్ని తయారు చేయించినట్టు చెప్పారు. మొక్కు చెల్లించుకునే పుణ్య కార్యానికి నారా భువనేశ్వరి, నారా రోహిత్లను ఆహ్వానించామని గుర్తు చేసుకున్నారు.
అయితే, ప్రజాసేవ, ట్రస్ట్ కార్యకలాపాల్లో బిజీవు ఉండే భువన్న సమయాభావంతో పుణ్య కార్యానికి రాలేకపోయారని, దాంతో నారా రోహిత్ చేతుల మీదుగా స్వామివారికి రథం సమర్పించానని అట్లూరి వివరించారు. మొక్కు చెల్లించుకున్న మరపురాని క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ఆరోజు ఆ కార్యక్రమానికి రాలేకపోయిన భువనమ్మ.. గుర్తుపెట్టుకుని ఎంతో వాత్సల్యంతో తన కుటుంబాన్ని ఇప్పుడు ఇంటికి ఆహ్వానించారని నిర్మాత అట్లూరి వివరించారు. తన కుటుంబంతో విలువైన సమయాన్ని ఆతిథ్యంతో వెచ్చించడమే కాదు, తన కుటుంబంపట్ల ఆమె చూపిన ఆప్యాయత, గడిపిన సంతోష క్షణాలు తమ జీవితాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆ సందర్భంలో భువనమ్మ చూపిన కృతజ్ఞతాభావంతో తన కుటుంబం జన్మ ధన్యమైందని అట్లూరి వివరించారు. ‘వాత్సల్యమూర్తి భువనమ్మ ఆదరణ జీవితంలో మర్చిపోలేనిది. ఆమె చూపిన ప్రేమ, ఆత్మీయత, గౌరవానికి నేను, నా కుటుంబం ఎప్పటకీ రుణపడే ఉంటాం’ అంటూ నిర్మాత అట్లూరి భావోద్వేగతంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
















