- 3600 పోస్టుల భర్తీ చేసే అవకాశం
- గతేడాది సిలబస్, నిబంధనలే ఈసారీ అమలు
- కసరత్తు పూర్తి చేస్తున్న పాఠశాల విద్యాశాఖ
అమరావతి (చైతన్య రథం): ర్రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్య, ఐటీ మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులూ కలిపి 3,600 వరకు ఉండొచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు.
జాబ్ క్యాలెండర్‌లో భాగంగా త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ గురువారం స్పష్టం చేయడం తెలిసిందే. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మాట్లాడిన ఆయన.. సమగ్ర శిక్షా అభియాన్‌లో ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై ప్రశ్నకు సమాధానమిస్తూ.. త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాలతో సర్వశిక్ష అభియాన్‌లో ఏపీలోనే ఎక్కవ జీతాలు చెల్లిస్తున్నామని చెబుతూనే.. కేంద్ర పథకం కనుక ప్రస్తుత అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామనీ హామీ ఇచ్చారు. అలాగే, ఈసారి డీఎస్సీలో కర్నూలుకు ఎక్కవ టీచర్ పోస్టులను మంజూరు చేస్తామనీ మంత్రి లోకేష్ స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో `పాఠశాల విద్యాశాఖ చేపట్టిన డిఎస్పీ నోటిఫికేషన్ సన్నద్ధతపై అభ్యర్థుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
















