- నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం
- దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై కూటమి ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించనుంది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ సచివాలయంలోని ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. జీపస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సుదీర్ఘ చర్చ జరగనుంది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సమావేశంలో చర్చిస్తారు. మూడు, నాలుగు త్రైమాసికఃల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీపం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రభుత్వం అందించే పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్తస్థాయిపై చర్చ జరగనుంది. అలాగే, ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలనుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై విభాగాధిపతులకు సీపం చంద్రబాబు సూచనలు చేయనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశాలపై శాఖలవారీగా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు.













