- వేట కష్టాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
మొగల్తూరు (చైతన్యరథం): పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం పర్యటించారు. తొలుత ఆయన ఫెర్రీ పాయింట్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. పడవల వద్ద కూర్చున్న నలుగురు మత్స్యకారులతో ముచ్చటించారు. తిరుమాని స్వామి అనే మత్స్యకారునికి సీఎం స్వయంగా పింఛను సొమ్ము అందజేశారు. వారి కుటుంబాల యోగక్షేమాలు, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే పథకాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. వేట సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో మత్స్యకారులు గల్లంతవుతున్న ఘటనలపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల దాదాపు 20రోజుల పాటు సముద్రంలో కనిపించకుండా పోయిన కోనసీమకు చెందిన మత్స్యకారులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో కోస్టార్డ్, నేవీ, కేంద్ర మెరైన్ విభాగాల సహకారం తీసుకున్న విషయాన్ని సీఎం చంద్రబాబు వారికి వివరించారు.
మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును సీఎం చంద్రబాబు వారిని అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల సేవలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న రూ.20వేల ఆర్థిక సాయం వేట నిషేధ సమయంలో తమను ఆదుకుంటోందని మత్స్యకారులు సీఎంకు తెలిపారు. ఈ సమయంలో తమతో పాటు పడవలోకి రావాలని ఓ మత్యకారుడు సీఎంను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఆయన మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? ఎన్ని గంటలు సముద్రంలో ఉండాలి? ఆ సమయంలో భోజనం ఎలా చేస్తారు? వంటి విషయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.












