- ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు
- ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డులు… రెండేళ్ల కష్టం ఫలించింది
- చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం
- రంపచోడవరం మెగా పేరెంట్-టీచర్ మీట్ లో విద్యా మంత్రి లోకేష్
రంపచోడవరం (చైతన్య రథం): వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. పాడైన బిల్డింగులను బాగు చేస్తామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రంపచోడవరం ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించిన మెగా పేరేంట్ టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. “మనందరి రెండేళ్ల కృషి ఫలించింది. సుమారు 1. 10లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. దీనికి కారణం ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులే. పిల్లల మంచిమార్కులే మనకు పబ్లిసిటీ. ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తున్నాం. నేను నా నియోజకవర్గం మంగళగిరిలో పర్యటిస్తునప్పుడు ఒక తల్లి నా దగ్గరకి వచ్చింది. అన్నా నా బిడ్డకి స్కూల్లో సీట్ కావాలి అని అడిగింది. ఆ సీట్ ప్రభుత్వ పాఠశాలలో కావాలని అడిగింది. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిడమర్రు స్కూలును పైలెట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేశాను. అది సక్సెస్ అయితే నియోజకవర్గానికి ఒక స్కూల్ కట్టాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం డిమాండ్ పెరిగింది. ఉపాధ్యాయుల కఠోరశ్రమతో ప్రభుత్వ స్కూళ్లకు పూర్వవైభవం వస్తోంది” అని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల కలల సాకార వేదిక.. మెగా పీటీఎం
“మన ఇంట్లో కొడుకైనా.. కూతురికైనా.. మొదటిసారి పాఠశాలకు వెళ్లే రోజు ప్రతి తల్లిదండ్రి కళ్లలో ఆనందం నింపుతుంది. అదే సమయంలో ఒక చిన్న ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదువుకోవాలి. గొప్పగా ఎదగాలి. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే ఆశ. ఆ ఆశను నమ్మకంగా… ఆ కలను నిజంగా మార్చే వేదికే మన మెగా పీటీఎం. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది తల్లిదండ్రులు పాఠశాలలకు రావడం చూస్తుంటే… ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంలా అనిపించడం లేదు. ఒక కుటుంబ వేడుకలా ఉంది. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు ముఖ్యమంత్రికి ఒక హామీ ఇచ్చాను. ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ పూర్వవైభవం తెస్తానని. ఈరోజు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయాణంలో మొదటి అడుగుపడింది. ఈ ప్రయాణంలో నాతోపాటు నడిచిన ప్రతి ఉపాధ్యాయుడికి… ప్రతి తల్లిదండ్రికి… ప్రతి విద్యార్థికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
త్యాగధనులు పుట్టిన నేల రంపచోడవరం
“రంపచోడవరం వచ్చిన తరువాత కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ నేలలో వీరత్వముంది. త్యాగముంది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడిచిన గొప్ప నేల రంపచోడవరం. గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి సాక్ష్యం ఈ గడ్డ. రంపచోడవరం అడవుల్లో అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య జ్యోతిని రగిలించారు. ఆ జ్యోతి దేశ భక్తిగా మారింది. ఇక్కడికి వచ్చినప్పుడు పచ్చని అడవితల్లి స్వాగతం “పలికింది. గిరిజనుల ఆత్మీయత మరిచిపోలేను. మెగా పీటీఎం మొదలు పెట్టినప్పుడు నుంచి ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటున్నాం. ఈ మెగా పీటీఎం గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను” అని లోకేష్ .
ఉద్వేగభరితంగా ప్రకటించారు. కనిపించే దేవుళ్లు టీచర్లు, తల్లిదండ్రులు
“మనం దేవుడిని చూడకపోయినా ఉన్నాడని నమ్ముతాం. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట దేవుడుంటాడు. సేవ ఉన్నచోట దేవుడుంటాడు. త్యాగం ఉన్న చోట దేవుడుంటాడు. మన లైఫ్ అలాంటి దేవుళ్ళు ఇద్దరే. మన మొదటి దేవుళ్లు తల్లిదండ్రులు, మన జీవితానికి దారి చూపించే దేవుళ్లు ఉపాధ్యాయులు. అందుకే ప్రతి మెగా పీటీఎంలో మనం ఒక అందమైన సంప్రదాయాన్ని ప్రారంభించాం. ‘తల్లికి వందనం’… ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మనకు జన్మనిచ్చిన తల్లికి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞత చెప్పడం, పిల్లలూ… ఇప్పుడు మీ అందరినీ ఒక చిన్న కోరిక కోరుతున్నాను. మీ తల్లి పాదాలకు నమస్కారం చేయండి. అమ్మకు నమస్కారం చేయడమంటే… దేవుడికి నమస్కారం చేసినట్టే.
అలాగే మీ ఉపాధ్యాయులను, మీ తల్లిదండ్రులను, మీ పెద్దలను ఎప్పుడూ గౌరవించండి. ఆ గౌరవమే మీ జీవితంలో గొప్ప విజయాలకు పునాది అవుతుంది. తల్లి ఆశీస్సులుంటే విజయానికి అడ్డు ఉండదు. గురువు ఆశీస్సులుంటే భవిష్యత్తు బాగుంటుంది” అని మంత్రి లోకేష్ ఉద్భోదించారు.
టీచర్వల్లే అబ్దుల్ కలాం ఉన్నతస్థానానికి..
“డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం చిన్నప్పుడు ఒక సాధారణ కుటుంబంలో పెరిగారు. తన జీవితంలో ఇద్దరు వ్యక్తులు నాకు గొప్ప బలం ఇచ్చారు. నా తల్లి… నా గురువు అని అబ్దుల్ కలాం చెప్పారు. తల్లి మంచి విలువలు నేర్పింది. గురువు పెద్ద కలలు కనడం నేర్పారు. ఒకరోజు ఆయన టీచర్ సుబ్రహ్మణ్య అయ్యర్ పక్షులు ఎలా ఎగురుతాయో పుస్తకంలో చెప్పి ఆపలేదు. పిల్లలందరినీ సముద్ర తీరానికి తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించారు. ఆ రోజు కలాం మనసులో విమానాలపై ఆసక్తి పుట్టింది. అదే ఆసక్తి ఆయనను ఏరోస్పేస్ ఇంజనీర్… క్షిపణి శాస్త్రవేత్తగా… చివరకు భారత రాష్ట్రపతిగా తీర్చిదిద్దింది. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక పాఠాన్ని మాత్రమే చెప్పడు. జీవితానికి దిశ చూపిస్తాడు. ఆ ఇద్దరూ లేకపోతే అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాలేకపోయేవారు. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక గొప్ప తల్లి… ఒక గొప్ప గురువు ఉంటారు” అన్నారు.
నా భవిష్యత్తు మీ చేతుల్లోనే..!
“నేను విద్యా శాఖ మంత్రి అయిన రెండేళ్ల తరువాత మీరంతా నాకు ఒక కిక్ మూమెంట్ ఇచ్చారు. నేను మొదటి పీటీఎం రోజు చెప్పాను టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 111, 222, 333, ర్యాంక్స్ అన్నీ మావేనని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు యాడ్స్ ఇస్తాయి. అలాంటి రిజల్ట్స్ మేము సాధిస్తాం, అటువంటి యాడ్ ఇస్తాం అని. నా కోరిక మీరు తీర్చారు.
ఈ ఏడాది వచ్చిన టెన్త్ అండ్ ఇంటర్ రిజల్ట్స్ మన పిల్లలు రికార్డులు బద్దలు కొట్టారు. ఇచ్చిన మాట ప్రకారం చరిత్రలో మొదటిసారి టెన్త్ అండ్ ఇంటర్లో ర్యాంక్స్ సాధించిన పిల్లల ఫొటోలతో యాడ్స్ ఇచ్చాం. అందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు, నా ఫోటో లేదు. ఇది నా విజయం కాదు. ఇది ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు విజయం. మన పిల్లల ఫోటోలను పేపర్లో, టీవీలో చూసినప్పుడు నాకు నిజంగా కిక్ వచ్చింది. మీరు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తేనే నాకు సీఎం మంచి మార్కులు వేస్తారు. మీరు పరీక్ష తప్పితే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు. మీ మార్కులే… నా ప్రోగ్రెస్ రిపోర్ట్. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం మీ చేతిలో ఉంటుంది. నా భవిష్యత్తు మీ చేతిలో ఉంది” అని మంత్రి లోకేష్ విద్యార్థులకు ఉద్ఘాటించారు.
















