- 331మంది హజ్ యాత్రికులకు రూ.3.31 కోట్లు విడుదల
- ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు ఎండీ షరీఫ్
మంగళగిరి (చైతన్య రథం): 2026 మక్కా హజ్ యాత్రకు వెళ్లిన హజ్ యాత్రికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, అదనపు విమాన ఛార్జీల భార పరిహారంకింద రూ.లక్ష సబ్సిడీని విడుదల చేయడంపట్ల ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు ఎండీ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. “2026 సంవత్సరానికిగాను రాష్ట్రం నుండి మొత్తం 1,987 మంది మక్కా హజ్ యాత్రకు వెళ్ళారు. అందులో 330 మంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, సుమారు 500 మంది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, మిగిలిన వారు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలతో పోలిస్తే, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వెళ్లిన హాజీలపై రూ.80,000 అదనపు విమాన చార్జీల భారంపడింది. దీనిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానవతా దృక్పథంతో స్పందించి, ఆ అదనపు భారానికి పరిహారంగా ఏకంగా రూ. లక్ష రూపాయలు చెల్లించాలని ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది విజయవాడ నుండి వెళ్లిన వారికి ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా, ఈ ఏడాది విజయవాడ నుండి వెళ్లిన 331మందికి కూడా తలా లక్ష రూపాయల చొప్పున, మొత్తం రూ.3 కోట్ల 31 లక్షల పరిహారాన్ని సబ్సిడీ రూపంలో ఈరోజు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం నేరుగా జమ చేసింది. ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటుందనడానికి ఇదే సజీవ నిదర్శనం” అన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, ఇచ్చిన హామీ మేరకు హజ్ యాత్రికులకు లక్ష రూపాయల అదనపు భార పరిహారాన్ని సత్వరమే విడుదల చేసిన సీఎంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికుల సబ్సిడీ చెల్లింపు ప్రక్రియలో కేవలం 15 రోజులు ఆలస్యమైన తరుణాన్ని ఆసరాగా చేసుకుని, సాక్షి పత్రిక, బ్లూ సోషల్ మీడియా దీనిని భూతద్దంలో చూపిస్తూ అసత్య ప్రచారాలకు ఒడిగట్టడం సిగ్గుమాలిన రాజకీయమని షరీష్ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అనుకూల మీడియా చేస్తున్న ఇటువంటి తప్పుడు, దిగజారుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా వైఎస్సార్సీపీ, వారి సోషల్ మీడియా విభాగాలు ఇటువంటి అబద్ధాల ప్రచార పద్ధతిని మానుకోకపోతే… “తస్మాత్ జాగ్రత్త” ప్రజలు మీకు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని షరీఫ్ హెచ్చరించారు.
















