- కులం, క్రిమినల్సే వైసీపీ బలం
- వైసీపీ గూండాలను తొక్కి నారతీస్తాం
- కాకినాడ మాటా మంతీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కాకినాడ (చైతన్యరథం) నేరస్థులకు కులాలు అంటగట్టవద్దని, ఏ కులానికి చెందినా నేరస్థుడు.. నేరస్థుడే అవుతాడని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేరస్థలకు కొమ్ముకాసే నేతలను ప్రజలు దూరం పెట్టాలని తెలిపారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే వారిని ఎన్నుకోబోమని గట్టిగా చెప్పాలన్నారు. నేరస్థులను ఆదరిస్తే.. మన
భవిష్యత్తును మంటగలిపేస్తారని హెచ్చరించారు. కాకినాడలో జిల్లా నేతలు, అధికారులతో కలిసి శనివారం నిర్వహించిన ‘మన ఊరు.. మాట మంతి’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లో కూర్చుని ప్రజల జీవితాలను శాసిస్తామంటే కుదరదని హెచ్చరించారు. తిరగబడటానికి జీవితకాలం తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. క్రిమినల్సు తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటే ప్రజల తలరాతలను ఎవరూ బాగుచేయలేరని చెప్పుకొచ్చారు. వైసీపీ కులం, క్రిమినల్సే బలం అని ఎద్దేవా చేశారు. క్రిమినల్స్ పాలకులు కాకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలో లేకున్నా ఆ పార్టీ నేతలు క్రిమినల్స్ గా బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ గూండాలను ఇక నుంచి తొక్కి నారతీస్తామని హెచ్చరించారు. తాను హోంమంత్రిని కాదని… అది క్రిమినల్స్ అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ రెండేళ్లు సహనంంగా, శాంతంగా ఉన్నానని స్పష్టం చేశారు.
వైసీపీ నేత అనంత బాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయన కులం గురించి ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కులాల దరిద్రం పోకపోతే ఏపీ బాగుపడదన్నారు. వైసీపీకి శవాలు లేస్తేగానీ సంతోషం రాదని వ్యంగ్యంగా అన్నారు. రానున్న మూడేళ్లలో వైసీపీకి తన యాక్షన్ చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ హయాంలో సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఆధారాలు లేకపోతే ఎవరినీ ఏమీ చేయలేమని చెప్పుకొచ్చారు. క్రిమినల్స్ పాలకులుగా ఉండకూడదని చెప్పారు. క్రిమినల్స్ను కులం కోణంలో చూడకూడదని చెప్పారు. క్రిమినల్స్ను వెనకేసుకొచ్చే నేతలను పక్కనపెట్టాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు.
జెన్ జీ.. జెన్ జీ అని కథలు చెప్పడం కాదు.. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలి. కొందరు కొన్ని అంశాలపైనే స్పందిస్తారు… నేను అన్ని అంశాలపై స్పందిస్తా. హోంమంత్రి వేసుకునే మేకప్తో గోడ నిర్మించవచ్చంటూ వైసీపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. వీళ్లనే కొందరు ఆదర్శంగా తీసుకొని… రేపు కాలేజీల్లో విద్యార్థినులను ఏడిపిస్తారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు తన చేతుల్లో లేవని తెలిపారు. తనను కులానికి పరిమితం చేయొద్దని.. ఏం జరిగినా తనను కులాల్లోకి లాగుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.














