కాకినాడ (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో నందనం పేరుతో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ జేఎన్‌టీయూకి చేరుకున్న మంత్రి లోకేష్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జేఎన్‌టీయూ యాజమాన్యం ఘనస్వాగతం పలికారు. అనంతరం పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని, సీసీ రోడ్లను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణంలో జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీల ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ ఫెయిర్ పేరుతో’ ఏర్పాటుచేసిన 20 స్టాళ్లను మంత్రి సందర్శించారు. వివిధ కాలేజీల విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించారు.
ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన అరటి దవ్వ నుంచి ఆహార ఉత్పత్తుల తయారీ ఆవిష్కరణ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ‘ద మొబైల్ బనానా ఎక్స్‌ట్రాక్టర’, రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ‘ఇంటిలిజెంట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ’ ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జేఎన్ టీయూలో రూ.10 కోట్ల రూసా, యూనివర్సిటీ నిధులు వెచ్చించి 53,606 చదరపు అడుగుల వైశాల్యంలో జీ ప్లస్ 2 పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని నిర్మించారు. దీంతో పాటు జేఎన్‌టీయూ క్యాంపస్‌లో రూ.21 కోట్ల యూనివర్సిటీ నిధులు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైయిన్స్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జేఎన్ టీయూ-కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డా.చేకూరి శివరామకృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ డా.ఎన్ మోహన్ రావు, జేఎన్‌టీయూకే ఇన్నోవేషన్ హెడ్ గోపాలకృష్ణతో పాటు ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, యనమల దివ్య, వరుపుల సత్యప్రభ, ఆదిరెడ్డి వాసు, జోనల్ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పి.రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
















