- రూ.13.4 కోట్లతో లైడార్ సర్వే
- డీపీఆర్ అనంతరం సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు
- జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి
- శంకరగుప్తం డ్రైన్ పనులకు భూమి పూజ
- వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి (చైతన్యరథం): గోదావరి జిల్లాల ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, 2003-04 లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 16.50 కి.మీ నుండి 22.90 కి.మీ వరకు తవ్వక పనులు చేపట్టామన్నారు. అనంతరం మరలా 2017-18 లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే డ్రైన్ ప్రవాహ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 0.00 కి.మీ నుండి 8.50 కి.మీ వరకు మొత్తం 8.50 కి.మీ డ్రెడ్జింగ్ విధానం ద్వారా ఆధునికీకరణ పనులు చేసినట్లు గుర్తు చేశారు. ఐతే 5ఏళ్ళ వైసీపీ ప్రభుత్వ పాలనలో శంకరగుప్తం డ్రైన్ పూడికతీత పనుల కోసం ఒక్క రూపాయి పని కూడా జరుగలేదని విమర్శించారు.
డ్రైన్ ద్వారా సముద్రపు నీరు చొచ్చుకు రావడంతో వేలాది ఎకరాల్లో రైతులు కొబ్బరి పంట నష్టపోవడంతో పాటు, ఇళ్ళల్లోకి కూడా ఉప్పునీరు వచ్చి చేరుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, శంకరగుప్తం డ్రైన్ సమస్యను ఆ ప్రాంత రైతులు, నాయకులు, స్వయంగా పాలకొల్లు వచ్చి తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వెంటనే ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా పరిశీలించి, అనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణులతో సర్వే చేయిపించి, తదనంతరం మరో రెండు సార్లు సమీక్షలు జరిపి రూ.20.77 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆర్థిక శాఖ అనుమతుల కోసం పంపించామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ఆర్థిక శాఖ నుండి నిధులు సాధించి పనులు ప్రారంభించామన్నారు. శంకరగుప్తం డ్రైన్ వల్ల నష్టపోతున్న రైతులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హమీని నెరవేర్చేలా, త్వరలోనే పనులు పూర్తిచేస్తామన్నారు. ఇంక గోదావరి జిల్లాల శాశ్వత ముంపు పరిష్కారానికి రూ.13.4 కోట్లతో లైడార్ సర్వే సైతం నిర్వహిస్తున్నామన్నారు. సర్వే అనంతరం డీపీఆర్ తయారు చేసి, శాశ్వతముంపు నివారణకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.















