- మెడికల్ అన్ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు
- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు
- సీఎం చంద్రబాబుకు రవాణామంత్రి మండిపల్లి కృతజ్ఞతలు
అమరావతి (చైతన్యరథం ప్రజా రవాణా శాఖ (ఏపీ పీటీడీ) ఉద్యోగులకు భారీ ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు నష్టపోకుండా చూడటం కూటమి ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుండి ఏపీ పీటీడీలో విలీనం అయిన ఉద్యోగుల్లో మెడికల్ అన్ఫిట్ అయిన వారికి తీపి కబురు చెబుతూ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వైద్య కారణాలతో విధులకు అనర్హులైన వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చొరవ చూపిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయిన నాటినుంచి దీనిని వర్తింపజేయనున్నారు.
దీంతో 2020 జనవరి 1 అనంతరం అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వికలాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం, వైద్య కారణాలతో అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి మండిపల్లి వెల్లడించారు. అర్హులైన ఉద్యోగులకు ప్రాధాన్యతా క్రమంలో నియామకాలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. వికలాంగుల జాబితాలో లేని ఉద్యోగులకు మానిటరీ కాంపెన్సేషన్ కొనసాగిస్తామన్నారు.. ఉద్యోగుల జీవన భద్రత, కుటుంబాల సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.















