- జగన్ ఐదేళ్ల పాలనలో పంచాయతీలు సర్వనాశనం
- నాడు కేంద్ర నిధులు దారి మళ్లించి, నేడు పిచ్చి ప్రేలాపనలు
- సర్పంచ్ ను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన విషయం గుర్తులేదా
- ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజం
అమరావతి (చైతన్యరథం ఐదేళ్ల పాలనలో గ్రామాలను భ్రష్టుపట్టించిన వైసీపీ నేతలు నేడు సిగ్గు లేకుండా నీతులు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో గ్రామాలను శ్మశానాలుగా మార్చి, పంచాయతీ వ్యవస్థను కుప్పకూల్చేసి.. నేడు మళ్లీ నీతులు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.. రాజ్యాంగబద్ధంగా 1973-74 అధికరణల ద్వారా పంచాయతీలకు అప్పగించిన అధికారాలను కూడా కాలరాసి, పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డిదే. రాజ్యాంగబద్ధంగా గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులను సైతం దారి మళ్లించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారు.
ఎందుకు చేశావు, ఎలా చేశావు అని ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, వారి అధికారాలకు విఘాతం కల్పించి, గంగలో కలిపేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇప్పుడు పంచాయతీల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గ్రామీణ వికాసంలో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిన పాపం జగన్ రెడ్డిది కాదా అని అలపాటి సూటిగా ప్రశ్నించారు.
గ్రామాలను పాడుబెట్టిన జగన్
గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన రూ.13,000 కోట్ల నిధులను దొంగచాటుగా దారి మళ్లించిన ఘనత జగన్రెడ్డిది. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, వారి ‘చెక్ పవర్’ లాక్కుని, వాలంటీర్ల పేరుతో సమాంతర రాజ్యాంగాన్ని నడిపించారు. వైసీపీ పాలనలో.. ఉపాధి హామీలో దొంగ మస్తర్లు వేసి వేల కోట్లు బొక్కేసి, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ రావాల్సిన తాగునీటి పథకంలో రూ.4,128 కోట్ల అవినీతికి పాల్పడింది. వాస్తవం కాదా? గ్రామాల్లో కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చడానికి పైసా కూడా ఇవ్వకుండా, ఊర్లను అధ్వాన్నంగా మార్చిన జగన్.. ఈ రోజు గ్రామాల గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపించడం లేదా. అని ఆలపాటి దుయ్యబట్టారు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ముప్పతిప్పలు పెట్టారు. పసుపు, మిర్చి, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లెక్కితే పట్టించుకోలేదు. పైగా ఆయన తాతల ఆస్తిలాగా భూమి పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు వేయించుకుని ‘భూ బకాసురుడిలా’ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అందుకే ప్రజలు విసిగిపోయి నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి పక్కన పడుకోబెట్టారని ఆలపాటి ధ్వజమెత్తారు.
కూటమి పాలనలో ‘పల్లె పండుగ’
మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు జగన్ పెట్టిన రూ.1,674 కోట్ల బకాయిలను తీర్చి, పంచాయతీలకు ఊపిరి పోశాం. రూ.7,232 కోట్ల ధాన్యం కొని, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. రూ.4,500 కోట్లతో ‘పల్లె పండుగ’ పేరుతో 4 వేల కిమీ మేర సీసీ రోడ్లు, 13 వేల నీటి తొట్టెలు, 20 వేల పంట కుంటలు నిర్మించి గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,987 కోట్లు విడుదల చేసి గ్రామ స్వరాజ్యాన్ని మళ్లీ నిలబెడుతున్నాం. చరిత్ర మర్చిపోయి కూటమి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ప్రజల విశ్వాసంతో గెలిచిన ప్రభుత్వం ఇది. జగన్ లాగా నిధులు దారి మళ్లించే అలవాటు మాకు లేదు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాను పారదర్శకంగా పల్లెల కోసమే ఖర్చు చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంటే చూసి ఓర్వలేక బురద జల్లుతున్నారు. నిజంగా జగన్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే.. గతంలో చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి మౌనంగా ఉండాలి. అంతే తప్ప అబద్దపు ప్రచారాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆలపాటి హెచ్చరించారు.














