విజయనగరం (చైతన్యరథం): ఉత్తరాంధ్రపై ఉన్న వెనుకబాటుతనం అనే ముద్రను చెరిపివేసి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఉపాధి, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు అన్నారు. ‘ఫూలే – అంబేద్కర్ అభ్యుదయ వేదిక’ ఆధ్వర్యంలో విజయనగరంలో ఆదివారం జరిగిన ‘‘ప్రజలతో ప్రజాప్రతినిధులు’’ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ మాట్లాడుతూ ఫూలే, అంబేద్కర్ ఆశయాలే కూటమి ప్రభుత్వానికి దిక్సూచి అని, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ అందించడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ తీరంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో లక్షలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయని, మన యువత ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వలస వెళ్లే అవసరం ఉండదని పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ విమానాశ్రయం మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే గ్రోత్ ఇంజిన్ అని.. దీనివల్ల లాజిస్టిక్స్, టూరిజం రంగాలు అభివృద్ధి చెంది ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఊతం వస్తుందని చెప్పారు. విశాఖ-విజయనగరం మధ్య ఎకనమిక్ రీజియన్ ద్వారా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. రానున్న రోజుల్లో విద్య, వైద్య, రవాణా పరంగా మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడడంతో పాటు ఉపాధి అవకాశాలు విశేషంగా పెరుగుతాయని చెప్పారు. విద్యార్థులకు గ్లోబల్ స్కిల్స్ అందించడంలో అధ్యాపకులు, సామాజిక న్యాయం కాపాడడంలో న్యాయవాదులు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ‘ఫూలే – అంబేద్కర్ అభ్యుదయ వేదిక’ అధ్యక్షుడు డా. ఎం హనుమంతరావు, ఉపాధ్యక్షులు డా. వావిలాపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డా. పులపర్తి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులతో పాటు వివిధ రంగాలకు చెందిన విద్యావంతులు పాల్గొన్నారు.
















